Friday, November 22, 2024

అడవిపై కార్పొరేట్‌ కన్ను.. అంతా కేంద్రం క‌నుస‌న్న‌ల్లోనే

జల్‌, జంగిల్‌, జమీన్‌ ఔర్‌ ఇజ్జత్‌ కోసం పోరాడే ఆదివాసీ ప్రజలను ఆపరేషన్‌ గ్రీన్హంట్‌ పేరిట అంతం చేస్తూనే ఆ తెగ బిడ్డనే రాష్ట్రపతి చేయడం కళ! కళ దానికదే ఉదాత్తమైన దేమి కాదు. బీజేపీ పాలనలో దళితులు, ఆదివాసీలు తీవ్రమైన దాడులకు గురవుతున్నారు. వారి హక్కులు హరించివేయబడుతున్నాయి. 5వ షెడ్యూల్లో ని భూమిని వినియోగించుకునేందుకు గిరిజనుల అంగీ కారం కావాలన్న క్లాజును తొలగించారు. గనులపై ఉన్న గిరిజన హక్కులను కాలరాసారు. కీలకమైన సేవలను ప్రైవేటీకరిస్తున్నారు. ప్రభుత్వ శాఖల పనులను బైటవారి తో చేయిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ హక్కును ఇలాంటి కుయుక్తులతో మాయం చేస్తున్నారు. ప్రైవేటీకరణ అంటేనే రిజర్వేషన్ల రద్దు. దీన్ని మోడీ ప్రభు త్వం వేగవంతంగా అమలు చేస్తోంది. షెడ్యూల్డు కులాల, తెగల సబ్‌ ప్లాన్‌ నిధులు భారీకోతలకు గురవుతున్నాయి. నూతన గనుల చట్టం ఆదివాసుల హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. అడవుల్ని నమ్ముకొని బతుకుతున్న కోట్లాది మంది ఆదివాసీలు బతుకు ఆగం చేసే నిర్ణయం మోడీ సర్కార్‌ తీసుకుంది. ఆదివాసీలు, గిరిజనుల అనుమతి అవసరం లేకుండా అటవీ భూముల్ని వివిధ ప్రాజెక్టులకు వినియోగించే ప్రక్రియకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.

‘అటవీ పరిరక్షణ నిబంధనావళి, 2022’ను నోటిఫై చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆదేశాలు జారీచేసింది. రియల్‌ మాఫియా చేపట్టే భారీ ఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణాలు, ప్రాజెక్టులు, చెట్ల నరికివేత, ఇతర అభివృద్ధి పనులకు నిబంధనల్ని సడలించింది. అడవుల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులు, ఇతరుల అనుమతి అవసరం లేకుండా… భూముల కేటాయింపు జరగనున్నది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఆ భూముల్ని రియల్‌ మాఫియా షెడ్యూల్‌ ఏరియాలో ఇకపై ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఆదివాసీ లకు నష్టపరిహారం చెల్లించే విధానం రియల్‌ మాఫియా కు అనుకూలంగా కేంద్రం మార్చింది. ఉదాహరణకు 5 నుంచి 40 హెక్టార్ల అటవీ భూములపై స్క్రీనింగ్‌ కమిటీ 60 రోజుల్లో కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నోటిఫై చేసిన కొత్త నిబంధనావళిపై పర్యావరణ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందని ఆదివాసీ లు, ఆదివాసీ మేధావులు ఆరోపిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం2006లో పేర్కొన్న నిబంధనా వళి స్థానంలో కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిం దని, ఇది అత్యంత ప్రమాదకరమైన విధానమని ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గనుల తవ్వకం, విద్యుత్‌ ప్రాజెక్ట్‌లు..

మొదలైనవాటి కోసం అడువుల నరికివేతకు మోడీ సర్కార్‌ సిద్ధమవుతోంది. బడా కార్పొరే ట్లకు కేటాయించిన ఆ ప్రాజెక్టుల కోసం చట్టాల్లో మార్పు లు చేస్తోంది. కొత్త నిబంధనావళిని తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఏదైనా ప్రయివేటు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వగానే, ఇకపై ప్రయివేటు డెవలపర్స్‌ అడవుల్ని నరికి వేసి..భూముల్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఆదివాసీలు, గిరిజనుల అంగీకారంతో సంబంధం లేకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఇదంతా కూడా అత్యంత ప్రమాద కరమైనదిగా పర్యావరణ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. అటవీ హక్కు ల చట్టాన్ని ఉల్లంఘిస్తూ కేంద్రం నిబంధనావళిని రూపొందించిందని విమర్శించారు. ‘వేదాంత’ కేసులో సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా నిబంధనావళి ఉందని తెలి పారు. ముందుగా స్థానిక ఆదివాసీలు, గిరిజనుల అనుమతి తీసుకున్నాకే ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతామని 2015లో కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవటమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అటవీ భూముల వాడకంపై కేంద్రం అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అటవీ భూముల్లో ప్రాజెక్ట్‌ చేపట్టడానికి ప్రయివేటు డెవలపర్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చాక, జిల్లా కలెక్టర్‌ చేసేదేముంటుం ది? గ్రామ సభ ద్వారా అభిప్రాయం, స్థానిక ఆదివాసీలు, గిరిజనుల హక్కుల పరిరక్షణ.. అంతా తూతూమంత్రం గా మారుతుంది. ఇదంతా అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించటమే. కొత్త అటవీ నియ మాలను తక్షణమే రద్దు చేసి వెనక్కు తీసుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement