Saturday, November 23, 2024

దేశ రాజధానిలో వడివడిగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ దేశ రాజధాని న్యూఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం యావత్ తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునే సందర్భమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం సుముహూర్తాన పార్టీ కార్యాలయ నిర్మాణ పనుల కోసం ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముగ్గు పోశారు. అనంతరం తవ్వకాలతో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.. మాఘలో పుట్టి పుబ్బలో కలుస్తుందని మొదట్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలో ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు ఏకంగా దేశ రాజధానిలోనే పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇంతటి చారిత్రాత్మక, బృహత్తర కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావులకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.

నిర్మాణ పనుల్లో శుక్రవారం మరో ముందడుగు పడిందని, ఇప్పటికే లోవర్ గ్రౌండ్ తవ్వకం పనులు పూర్తవగా, ఫూటింగ్ పనుల కోసం ముగ్గుపోశామని తెలిపారు. నిర్దేశించుకున్న సమయానికల్లా పార్టీ కార్యాలయ భవనం సిద్ధమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. కాంట్రాక్ట్ సంస్థ, ఏజెన్సీతో మంత్రి సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కార్యాలయ భవన నిర్మాణ పనులు జరగాలని ఆదేశించారు. అనుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా వేగంగానూ, అదే సమయంలో నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా పనులు కొనసాగించాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement