హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : జ్ఞానవిద్యా ప్రసాదిని, రాజయోగ ప్రదాయినిగా ఖ్యాతికెక్కిన రాజశ్యామల అమ్మవారి ఆలయం తొలిసారి తెలంగాణ గడ్డపై నిర్మాణమవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా రాజశ్యామల అమ్మవారికి దేవాలయం నిర్మించాలని విశాఖ శ్రీ శారదాపీఠం నిర్ణయించింది. ఈమేరకు సన్నాహాలు చేస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటల 7 నిముషాలకు శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించారు. విశాఖ శ్రీ శారదాపీఠానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలో రెండెకరాల స్థలం మంజూరు చేసింది. ఆ స్థలంలోనే రాజశ్యామల అమ్మవారి కోవెల నిర్మాణం జరగనుంది. ఆలయ నిర్మాణం ఆగమోక్తంగా సాగాలని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి నిర్ణయించారు. ఈమేరకు ఉద్ధండులైన ఆగమ పండితులను సంప్రదించారు. దక్షిణ భారతావనికే తలమానికంగా నిలిచేలా ఆలయ నిర్మాణం ఉండాలని స్థపతులతో చర్చించారు.
శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ప్రణాళికను సిద్ధం చేసారు. చోళులు, పల్లవుల నాటి నిర్మాణ శైలి ఆలయంలో కనపడుతుందని నిర్వాహకులు తెలిపారు కాకతీయుల శిల్ప కళా నైపుణ్యంతో శిలలు చెక్కుతారు. కోకాపేటలో ఇప్పటికే పీఠం సంబంధిత ఇతరత్రా నిర్మాణాలు సిద్ధమవుతున్నాయి. జగన్మాత రాజశ్యామల అమ్మవారి ఆలయం ప్రస్తుతానికి విశాఖ శ్రీ శారదాపీఠంలో మాత్రమే ఉంది. రాజశ్యామల అమ్మవారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆరాధ్య దైవం. అమ్మవారి విగ్రహారాధన యావత్ భారతావనిలో కేవలం విశాఖ శ్రీ శారదాపీఠంలో మాత్రమే జరుగుతోందని గతంలో కేసీఆర్ స్వయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో కేసీఆర్ రాజశ్యామల యాగాన్ని సైతం చేపట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలోనే యాగాన్ని నిర్వహించారు.
మహిమాన్వితం రాజశ్యామల అమ్మవారి వైశిష్టం
విశాఖ శ్రీ శారదాపీఠం ఆధిష్టాన దేవత రాజశ్యామల అమ్మవారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామలగా అమ్మవారు విశాఖ శ్రీ శారదాపీఠంలో పూజలందుకుంటోంది. రాజశ్యామల అమ్మవారి దర్శనానికి, అనుగ్రహానికి కేరాఫ్ అడ్రస్‌గా విశాఖ శ్రీ శారదాపీఠం విశేష ప్రాచుర్యం పొందింది. హిమాలయాల్లో ఒక తపస్సంపన్నుడి ద్వారా అమ్మవారి మంత్ర, తంత్ర విధానాన్ని తెలుసుకున్నానని స్వరూపానందేంద్ర స్వామి అనేక సందర్భాల్లో తెలిపారు. అంతేకాదు, విశాఖ శ్రీ శారదాపీఠ గురుపరంపరలో పూర్వం నుంచి రాజశ్యామల అమ్మవారి అనుష్టానం ఉంది. మరెక్కడా లేని విధంగా అమ్మవారికి మంత్ర ప్రదానంగా అర్చనా విధులు ఇక్కడ జరుగుతాయి. అమ్మవారి విగ్రహారాధన కూడా కేవలం విశాఖ శ్రీ శారదాపీఠంలోనే కనిపిస్తుంది. వేదకాలంలో భండాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి ఆ జగన్మాతయే రాజశ్యామల అమ్మవారిగా మంత్ర తంత్ర ప్రదానంగా అవతరించినట్లు చెబుతారు.
హయగ్రీవుడు అగస్త్యునికి ధర్మ సూక్ష్మాలను ఉపదేశిస్తున్న సమయంలో రాజశ్యామల ప్రస్తావన వచ్చింది. ఎంతోమంది రుషులు, మునులు అనేక ఉపాసనా గ్రంధాలలో రాజశ్యామల యొక్క అనుష్టానాన్ని, తత్వాన్ని విశేషంగా ప్రస్తావించారు. శారదా తిలకం, ప్రపంచ సార తంత్రం, ఆమ్నాయ మందారం తదితర ఉత్కృష్టమైన గ్రంధాలలో, మహావిద్య ఉపాసనలో కూడా అమ్మవారి మహిమ అపారంగా కనిపిస్తుంది. విశాఖ శ్రీ శారదాపీఠంలోని రాజశ్యామల అమ్మవారి ఆలయంలో గురువుల ద్వారా ప్రాప్తించిన రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహం మూలవిరాట్టు-కు ఉత్తర భాగాన ఉంటు-ంది. అమ్మవారికి సుఖ శ్యామల, వీణా శ్యామల, శారద, రాజమాతంగి అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. రాజశ్యామల అమ్మవారి గురించి విశేషంగా చెప్పాలంటే రాజకీయ లబ్ధిని ఆశించే నేతలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తుంటారు.
ఎందుకంటే అమ్మవారి రధం గేయ చక్రం. అది విజయానికి సంకేతం. భండాసుర సంహార వేళ జరిగిన యుద్ధంలో తంత్రము, మంత్రాంగం ఈ అమ్మవారే నిర్వహించిన కారణంగా రాజకీయ రంగంలో ఉన్నవారు అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్న విశ్వాసం సర్వత్రా నెలకొంది. ఈకారణంతోనే రాజకీయ రంగానికి చెందిన అగ్రగణ్యులు, అనేకమంది రాజనీతిజ్ఞులు విశాఖపట్నం వచ్చి రాజశ్యామల అమ్మవారిని పూజిస్తుంటారు. రాజశ్యామల అమ్మవారి ఉపాసనతో రాజ్యాధికారం దక్కించుకున్న వారెందరో ఉన్నారని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రస్తుత ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్, అనేక రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అమ్మవారిని ఆరాధించిన వారిలో ఉన్నారు.