Saturday, November 23, 2024

గంటలు మోగించి, డప్పులు వాయించండి.. గ్యాస్‌ సిలెండర్లకు దండలు.. వారం పాటు నిరసనలు

పెట్రోధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్‌ 7వ తేదీవరకు మేంగాయ్‌ ముక్త భారత్‌ అభియాన్‌ పేరిట మూడు దశల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల చివరి రోజు, గురువారం ఉదయం 11 గంటలకు దేశమంతటా ప్రజలంతా గంటలు మోగించాలని, డప్పులు, ఇతర గృహోపకరణాలు వాయించి నిరసన తెలపాలని కోరింది. బహిరంగ ప్రదేశాల్లోను చప్పుళ్లు చేయాలని, ఇంటినుంచి బయటకు వచ్చి వీధుల్లో గ్యాస్‌ సిలెండర్లకు దండలు వేసి ప్రజల అసంతృప్తిని వెల్లడించాలని కోరింది. కోవిడ్‌ మహమ్మారి ప్రబలిన సమయంలో ప్రధాని నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా చప్పట్లు కొట్టాలని.. గిన్నెలు మోగించాలని పిలుపునిచ్చిన తరహాలో ఇప్పుడు కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలకు చేపట్టడం గమనార్హం. గడచిన ఐదురోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్‌, డీజిల్‌లో ప్రతిసారి 80 పైసల చొప్పున పెంచుతూ వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజలను నిలువునా దోచుకుంటోందని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ శనివారం ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బధిర ప్రభుత్వానికి వినిపించేలా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

గడచిన ఐదు రోజుల్లో లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై దాదాపు రూ.3.20 రూపాయల మేర ధరలు పెరిగాయని ఉదహరిస్తూ మోడీ ప్రభుత్వం సిగ్గూఎగ్గూ లేకుండా ప్రజలను నిలువునా దోచుకుంటోందని విమర్శించారు. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 4 నెలలపాటు పెట్రో ధరల జోలికి వెళ్లని కేంద్రం, ఇప్పుడు రోజూ ధరలు పెంచుతోందని కాంగ్రెస్‌ మరో అధికార ప్రతినిధి షామా మోహమ్మద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గడచిన ఎనిమిదేళ్లలో పెట్రోలు, డీజిల్‌పై ఎక్సయిజ్‌ పన్ను పెంచడం ద్వారా రూ.26 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ఈ నిలువుదోపిడీని అడ్డుకుని తీరాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్రంపై రాహుల్‌గాంధీ కూడా ఎదురుదాడి చేశారు. పెట్రో ధరల మంటలతో ప్రజలు అల్లల్లాడుతూంటే బీజేపీ యూపీలో ప్రమాణస్వీకారోత్సవంలో తలమునకలైందన్న ఏఐసీసీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ, మోడీ ప్రభుత్వం తీరు దేశం ద్రవ్యోల్బణంతో సతమతమవుతూంటే రాజప్రాసాదాన్ని నిర్మాలించాలని రాజు అనుకున్న తరహాలో ఉందని ఎద్దేవా చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement