Saturday, November 23, 2024

Delhi | కాంగ్రెస్ జాబితా దాదాపు సిద్ధం.. రోజంతా జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగనున్న అభ్యర్థుల జాబితా దాదాపుగా సిద్ధమైంది. ఆదివారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌లో సుదీర్ఘంగా జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కొన్ని స్థానాలు మినహా దాదాపు మిగతా అన్ని స్థానాలపై కసరత్తును కొలిక్కి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఉదయం గం. 11.00 సమయంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది.

స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కే. మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సభ్యులుగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కి, బాబా సిద్ధిఖి తదితరులు పాల్గొన్నారు. రాత్రి గం. 8.00 వరకు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగ్గా, ఆ తర్వాత కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తెలంగాణ నేతలతో విడివిడిగా కాసేపు చర్చించారు. అవసరమైతే మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది.

- Advertisement -

ఓవైపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుండగా మరోవైపు ఆశావహులు వార్ రూమ్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపికలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయడం లేదని కొందరు నేతలు ఆరోపించారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి టికెట్లు ఇవ్వకూడదని, అలాగే పార్టీలో కనీసం ఐదేళ్లు పనిచేసినవారికే ఇవ్వాలని ఉదయ్‌పూర్ డిక్లరేషన్ చెబుతుంటే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత కల్పించాలని ఓవైపు మహిళా కాంగ్రెస్ నేతలు, మరోవైపు యూత్ కాంగ్రెస్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేశారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు వార్ రూం లోపలకు వెళ్తున్న నేతలతో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు మాట్లాడారు. గత ఎన్నికల్లో మహిళలకు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని, ఈసారి కనీసం 20 సీట్లైనా ఇవ్వాలని ఆమె కోరారు.

యూత్ కాంగ్రెస్ నేతలు కనీసం తమకు 5 సీట్లు ఇవ్వాలని, గత ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న యూత్ కాంగ్రెస్ విభాగమేనని అంటున్నారు. పారాచ్యూట్ నేతలకు టికెట్లు ఇవ్వొద్దని, ఓటర్లు కొత్త ముఖాలను కోరుకుంటున్నారని, ఆ క్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలకు అవకాశం కల్పించాలని వారు అభ్యర్థిస్తున్నారు.

ఓయూ జేఏసీ నేతల ధర్నా

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఓయూ జేఏసీ నేతలు తమకు సరైన ప్రాతినిథ్యం కల్పించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ వార్ రూం వద్ద ధర్నా చేశారు. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న నేతలు సుమారు 15 మంది ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని, తమకు కనీసం 5 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

వార్ రూం నుంచి ఆ సమయంలో బయటకు వస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేందర్ సింగ్ ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలతో మాట్లాడారు. వారి సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని, అందరికీ న్యాయం జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు. వారి ఆందోళన, అభ్యంతరాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానంటూ హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

వారంలోపే జాబితా: కోమటిరెడ్డి

స్క్రీనింగ్ కమిటీ సమావేశం అనంతరం బయటికొచ్చిన నేతల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలెక్షన్ కమిటీ సమావేశం ఉంటుందని చెప్పారు. ఆదివారం నాటి సుదీర్ఘ సమావేశంలో అన్ని స్థానాల అభ్యర్థులపై చర్చ జరిగిందని తెలిపారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం మేరకు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని చెప్పారు. వారం రోజుల్లోగా జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement