ఉత్తర భారతదేశాన్ని చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయింది. ఈ కోల్డ్ వేవ్ పరిస్థితులు శుక్రవారం మరింత తీవ్రమయ్యాయి. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో గురువారం ఒక్కరోజే ఏకంగా 25మంది మరణించారు. వీరంతా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందినట్లు నివేదికలు వెల్లడించాయి. వీరిలో 17మంది ఎలాంటి వైద్య సహాయం అందక ముందే ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు తెలిపాయి. తీవ్రమైన చలి కారణంగా రక్తపోటు ఒక్కసారిగా పెరిగి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లు వస్తున్నాయని వైద్యులు తెలిపారు.
ఢిల్లిలో 1.8 డిగ్రీల టెంపరేచర్లు నమోదు..
ఢిల్లిలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఉదయం నైరుతి ఢిల్లిలోని ఆయానగర్‌లో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. సప్దర్‌జంగ్‌లో 4.0 డిగ్రీలుగా నమోదైనట్లు పేర్కొంది. ఆయా నగర్‌లో 1.8 డిగ్రీల సెల్సియస్, రిడ్జ్‌లో 3.3 డిగ్రీలు, లోధి రోడ్డులో 3.8 డిగ్రీలు, జఫ్రాపూర్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 3.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. మరోవైపు తీవ్రమైన చలి కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పలువురు రోడ్లపై చలిమంటలు వేసుకుని చలినుంచి ఉపశమనం పొందుతున్నారు. తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా విజబిలిటీ చాలా తక్కువగా ఉంది.
దూరంలోని వాహనాలు కనిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్డు, రైలు, విమాన మార్గాల్లోని రాకపోకపలై తీవ్ర ప్రభావం పడుతోంది. ఢిల్లిలో సుమారు 26 రైళ్లు గంట నుంచి 10గంటల మేర ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరో 24 గంటల వరకు ఇలాంటి పరిస్థితులే ఉండొచ్చని ఐఎండీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. మరోవైపు విపరీతంగా పెరుగుతున్న చలిగాలులు కారణంగా.. ఢిల్లిలో నిరాశ్రయుల కోసం షెల్టర్‌లు ఏర్పాటు చేశారు. ఢిల్లి వ్యాప్తంగా 197 శాశ్వత షెల్టర్ హోమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఢిల్లి అర్బన్ షెల్టర్ ఇంప్రూమెంట్ బోర్డ్ సభ్యుడు విపిన్ రాయ్ తెలిపారు. చలికాలంలో ఢిల్లిdలో దాదాపు 250 టెంట్లు వేసినట్లు చెప్పారు. అదేవిధంగా నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశామని.. భోజన సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు.