న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర తీరం విపరీతంగా కోతకు గురవుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో 29 శాతం మేర కోతకు గురవుతూ క్షీణిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నంలో 15.42 కి.మీ పొడవైన తీరం ఇప్పటివరకు 3.5 కి.మీ మేర కోతకు గురైందని వెల్లడించారు. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్సీసీఆర్) అధ్యయనంలో కోతకు గురవుతున్న తీర ప్రాంతం గురించి భయానక వాస్తవాలు వెలుగులోకొచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294.89 కిలోమీటర్లు అంటే 28.7 శాతం తీరప్రాంతం వివిధ స్థాయిల్లో కోతకు గురైందని వెల్లడిస్తూ అత్యధికంగా తూర్పుగోదావరిలో (89.25 కి.మీ), ఆ తరువాత కృష్ణ జిల్లా (57.55 కి.మీ), నెల్లూరు (53.32 కి.మీ), విశాఖపట్నం (25.81 కి.మీ), శ్రీకాకుళం (25.12 కి.మీ) మేర తీరం కోతకు గురయ్యిందని కేంద్రమంత్రి తెలియజేశారు.
తీరం కోతకు గురవడానికి తలెత్తుతున్న పరిస్థితులు, కారణాల గురించి వివరిస్తూ.. ఉష్ణమండల తుఫానులు, రుతుపవనాల కారణంగా తలెత్తే వరదలు, సముద్ర మట్టం పెరుగుదల తదితర ప్రకృతి సహజ వైపరీత్యాలకు తోడు ఓడరేవులు, నౌకాశ్రయాల నిర్మాణాలు, నదులు దెబ్బతినడం వంటివి కూడా కోతకు కారణమవుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. కోత కారణంగా భూమి, ఆవాసాలు, మత్స్యకారులు జీవనోపాధి దెబ్బతినడంతో పాటు ఫిషింగ్ కార్యకలాపాలకు అవసరమైన స్థలం తగ్గిపోతుందని చెప్పారు. విశాఖ నగరంలో మూడు దశాబ్దాలుగా కోతను ఎదుర్కొంటోందని, ప్రతికూల పరిస్థితుల్లో సుమారు 3.5 కిలోమీటర్ల పర్యాటక బీచ్, తీరప్రాంత రహదారులు కోతకు గురై క్షీణించాయని వివరించారు.
అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. తీరం కోతను నివారించేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందించి, విశాఖ నుంచే దాన్ని అమలు చేయడం మొదలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని చెప్పారు. విశాఖ వంటి సుందర పర్యాటక నగరంలో తీర ప్రాంతం కోతకు గురవడం సామాన్య విషయం కాదని అన్నారు. నగరవాసుల్లో కూడా ఈ విషయంపై పూర్తి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. త్వరలో విశాఖలో ఈ విషయంపై వివిధ వర్గాల ప్రముఖులతో ఒక అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.