Wednesday, November 20, 2024

డిజిటల్‌ మీడియాకు కళ్లెం.. ఈ సమావేశాల్లోనే నియంత్రణకు బిల్లు

దేశంలో సామాజిక మాధ్యమాలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. డిజిటల్‌ మీడియా నియంత్రణకు ఉద్దేశించిన బిల్లును వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ అండ్‌ పీరియాడికల్స్‌ బిల్లు పేరుతో తీసుకువచ్చే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందితే, ఇప్పటివరకు పత్రికలు, ప్రింటింగ్‌ ప్రెస్‌లను నియంత్రించేందుకు అమల్లో ఉన్న ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బుక్స్‌ యాక్ట్‌, 1867 చట్టం రద్దవుతుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే పత్రికలు, ప్రింటింగ్‌ ప్రెస్‌ల కోవలోకే డిజిటిల్‌ మీడియా వేదికలు వస్తాయి. ప్రతి డిజిటల్‌ మీడియా సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ బిల్లుపై ఇంకా కేబినెట్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఏ ఎలక్ట్రానిక్‌ పరికరం ద్వారా ప్రసారమయ్యే వార్తలన్నింటినీ నియంత్రించేలా ఈ బిల్లును సిద్ధం చేస్తున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లులో పేర్కొన్నదాని ప్రకారం ఇంటర్నెట్‌, కంప్యూటర్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రసారమయ్యే సమాచారం, దృశ్య, శ్రవణ సమాచారం, గ్రాఫిక్స్‌ డిజిటల్‌ మీడియా విభాగంలోకే వస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement