న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రకృత్తి విపత్తు నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన అతి భయంకరమైన ప్రకృతి విపత్తులో అనేకమంది స్థానికులు ప్రాణాలను కోల్పోగా, మరెంతో మంది జీవనోపాధిని కోల్పోయారని కేంద్ర ప్రభుత్వానికి తెలుసా? మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్రంలో పని దినాల సంఖ్యను 100 రోజులకు పెంచాలని గత ఆరు నెలల్లో ఏమైనా అభ్యర్థనలు అందాయా? . పనిదినాలను పెంచాలని భావిస్తున్నారా? ఒకవేళ భావిస్తే సంబంధిత నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో తెలపాలని, లేదంటే అందుకు గల కారణాలను వివరించాలని వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ లోక్‌సభలో ప్రశ్నించారు. అందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానమిచ్చారు. కేంద్ర హోంశాఖ వారందించిన సమాచారం ప్రకారం విపత్తు నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని, ఎస్డీఆర్ఎఫ్ ద్వారా ఏర్పాటు చేసిన నిధులతో, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పద్ధతులు, నిబంధనలకు అనుగుణంగా అవసరమైన సహాయ చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలే చేపడతాయని, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక అంతర్గత మంత్రిత్వ శాఖ బృందం అంచనాల ఆధారంగా ఎన్డీఆర్ఎఫ్ నిధుల ద్వారా అవసరమైన అదనపు ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22, 2021 తేదీన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోవడం, రోడ్లు దెబ్బ తినడం, విద్యుత్ సరఫరా లైన్లు తెగిపోవడం వంటి ఇతర సమస్యలన్నీ కలిపి సుమారు 6,054 కోట్ల రూపాయల నష్టాన్ని అంచనా వేసి, తక్షణ సహాయ, పునరుద్ధరణ చర్యల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని, అలాగే డిసెంబర్ 9, 2021 వ తేదీన తాత్కాలిక సహాయ చర్యల నిమిత్తం సుమారు 1026.74 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు కేంద్రమంత్రి పేర్కొన్నారు. కేంద్రం నవంబర్ 23, 2021 వ తేదీన కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేయగా వారు నవంబర్ 26 నుండి 29 వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసిన నివేదిక, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సబ్ కమిటీ సూచనల ఆధారంగా హై లెవెల్ కమిటీ కేంద్ర ప్రభుత్వం 351.43 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసి విడుదల చేసినట్లు ఆమె తెలిపారు.
అంతేకాకుండా 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 1192.80 కోట్ల రూపాయలను ఎస్డీఆర్ఎఫ్ నిధుల ద్వారా కేటాయించగా, అందులో కేంద్ర ప్రభుత్వ వాటా 895.20 కోట్లు రెండు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్టు సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను నరేగా పథకానికి కేంద్ర ప్రభుత్వం 25.93 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని, తద్వారా రాష్ట్రం దేశంలో 6వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్యం లేని పనులు చేయడానికి స్వఛ్చందంగా ముందుకొచ్చే పెద్దలున్న ప్రతి ఇంటికి కనీసం 100 రోజుల ఉపాధిని కల్పించి, వేతనాన్ని అందజేయాలని, అంతేకాకుండా కరవు/ప్రకృతి విపత్తుతో నష్టపోయినట్లు నోటిఫై చేసిన గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఆర్థిక సంవత్సరానికి అదనంగా 50 రోజుల వరకు నైపుణ్యం లేని వారి పనికి వేతన ఉపాధి అందించడానికి సదుపాయం ఉందని వెల్లడించారు. అలాగే అందులోని సెక్షన్ 3 క్లాజ్ 4 ప్రకారం చట్టంలో పేర్కొన్న కాల వ్యవధికి మించి రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర నిధుల నుంచి మరిన్ని అదనపు రోజులకు ఉపాధి వేతనం కల్పించే వెసులుబాటు ఉందని, ఆ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తెలిపినట్లు కేంద్రమంత్రి ఎంపీ అనురాదకు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..