Monday, November 25, 2024

ఉక్రెయిన్‌ మెడికోలకు కేంద్రం బిగ్‌షాక్‌.. విదేశీ విద్యార్థులకు సీటివ్వడం కుదరదు

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి ఇండియా వచ్చిన వైద్య విద్యార్థులకు కేంద్రప్రభుత్వం బిగ్‌షాకిచ్చింది. ఇండియాలో ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ మెడికల్‌ స్టూడెంట్స్‌ను ఇండియాకు ట్రాన్స్‌ ఫర్‌ చేయడం కుదరదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. ఇండియాలో నిర్వహించే మెడికల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నీట్‌లో తక్కువ స్కోర్‌ రావడం వల్లనే ఆ విద్యార్థులు మెడిసిన్‌ చదవడానికి ఉక్రెయిన్‌ సహా పలు విదేశాలకు వెెళ్లారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో సైతం అడ్మిషన్లు నీట్‌ స్కోర్‌ ప్రకారమే జరుగుతాయని, వారి మార్కులు లేదా ప్రైవేట్‌ కళాశాల ఫీజుల ఆధారంగా అడ్మిషన్లు లభిస్తాయని వెల్లడించింది. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థుల కోసం ఇప్పటికే కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగిందని, మిగిలిన విద్యార్థులకు ఆ రిలాక్సేషన్స్‌ ఇవ్వడం ద్వారా మెడికల్‌ ఎడ్యుకేషన్‌ చట్టాన్ని ఉల్లంఘించాల్సి వస్తుందని కేంద్రం పేర్కొంది. నీట్‌లో సున్నా మార్కులు వచ్చిన వారికి సైతం ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో సీట్లు కేటాయించారన్న పిటిషనర్ల ఆరోపణలను కేంద్రం ఖండించింది.

ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో వైద్య విద్యార్థులను ఇండియాకు తరలిస్తున్న క్రమంలో, కేంద్రప్రభుత్వం విదేశీ విద్యార్థులకు భరోసా ఇచ్చిందని ప్రస్తావించగా, దాని అర్థం భారత వైద్య విద్యాసంస్థల్లో విదేశీ వైద్య విద్యార్థులకు బ్యాక్‌ డోర్‌ ఎంట్రీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థులు తమ చదువును ఇండియాలోని మెడికల్‌ కాలేజ్‌ల్లో కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ, దాఖలైన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌గుప్తా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ల ద్విసభ్య ధర్మాసన బెంచ్‌ కేంద్ర ఆరోగ్యశాఖకు, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కు నోటీసులు జారీ చేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి సుమారు 14 వేల మంది భారతీయ వైద్య విద్యార్థులు చదువు మధ్యలో ఇండియాకు తిరిగి రావడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement