Friday, November 22, 2024

రాష్ట్రాలు చేసే అపరిమిత అప్పులను కేంద్రం నియంత్రించాలి.. శ్రీలంక నుంచి నేర్చుకోవాలి: టీడీపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు చేస్తున్న అపరిమిత రుణాలను కేంద్ర ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరముందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అభిప్రాయపడింది. ఆదివారం ఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆ పార్టీ తరఫున టీడీపీపీ నేత గల్లా జయదేవ్, రాజ్యసభాపక్ష నేత కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ కాన్ఫరెన్సు హాల్‌లో కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. దేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఉచిత బూస్టర్ డోసు గురించి అఖిలపక్ష భేటీలో ప్రస్తావించామని తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్త పరిణామాలతో దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, ధరల స్థిరీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించినట్టు కనకమేడల తెలిపారు. పొరుగుదేశం శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తూ.. ఆ తరహా దుస్థితి దేశంలోని ఏ రాష్ట్రానికీ తలెత్తకూడదని అన్నారు. ఈ క్రమంలో దివాళా అంచున ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల విషయంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగుతుందని కోర్టులో అఫిడవిట్ ఇచ్చినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పర్యవేక్షణ చేయాలని కోరినట్టు తెలిపారు. గోదావరి నది వరదల గురించి కూడా సమావేశంలో ప్రస్తావించినట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరదల గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీల గురించి తమతో పాటు వైఎస్సార్సీపీ నేతలు కూడా ప్రస్తావించారని, అయితే హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని వారు నిలదీయడం లేదని అన్నారు. మొక్కుబడిగా అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించడం, ఆ తర్వాత గాలికొదిలేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. కేంద్రం మెడలు వంచుతారో, లేక తమ మెడలే వంచుతారో తమకు అనవసరమని, కానీ ప్రత్యేక హోదా మాత్రం సాధించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రంలో నెలకొన్న మైనింగ్ మాఫియా సహా అనేక ఇతర సమస్యల గురించి ప్రస్తావించనున్నట్టు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.

సామాజిక కోణంలోనే ద్రౌపతి ముర్ముకు మద్ధతు
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సామాజిక కోణం దృష్టిలో పెట్టుకుని ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్ధతు ప్రకటించామని కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో పార్టీలో ఇంకా చర్చించలేదని, చర్చించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటిస్తామని అన్నారు. ఉచిత పథకాల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు స్పందన కోరగా, అట్టడుగున ఉన్న వర్గాలకు చేయూతనివ్వడం కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని, తాము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని అన్నారు. అయితే సంక్షేమం దుర్వినియోగం కారాదని ఆయన అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement