Monday, November 25, 2024

కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటుపైనా కేంద్రం మాట తప్పింది.. తెలంగాణ అభ్యంతరాలపై కేఆర్‌ఎంబీ దృష్టి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కృష్ణానదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు కొత్తగా ట్రిబ్యునల్‌ను వేయాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వ నాన్చివేత దోరణిపై తెలంగాణ నీటిపారుదల శాఖ చాలా సీరియస్‌గా ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. కృష్ణాపై ట్రిబ్యునల్‌ ఏర్పాటుతోపాటు అంతరాష్ట్ర నదీ వివాదాల పరిష్కారం అంశాన్ని తేల్చుకునేందుకు ఢిల్లికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల బృందం వెళ్లింది. సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై ఆలోచిస్తామన్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మాట తప్పిందని నీటిపారుదల శాఖ ముఖ్య అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఉండగా కొత్తగా మరో ట్రిబ్యునల్‌ అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గతంలో ఇచ్చిన రెండు తీర్పుల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయమే జరిగిందని ప్రముఖ సాగునీటిరంగ నిపుణులు డా.సారంపల్లి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌కు, సుప్రీంకోర్టు ఒక మాట చెప్పి… ఆ మాటకు కట్టుబడకుండా ఉండటం కేంద్రానికే చెల్లిందని తప్పుబడుతున్నారు. కృష్ణా నీటి కేటాయింపుల విషయంలో 75శాతం డిపెండబుల్‌ జలాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉండగా బ్రిజేష్‌ కుమార్‌ 65శాతం జలాలను మాత్రమే తీసుకున్నారని నిపుణులు ఆరోపిస్తున్నారు. బ్రిజేష్‌ కుమార్‌ తెలంగాణలోని కరువు ప్రాంతమైన మహబూబ్‌నగర్‌ను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటిపారుదల నిపుణులు, నీటిపారుదల శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ విషయమై కేంద్ర జలశక్తి శాఖతో సంప్రదింపులు జరిపేందుకు ప్రత్యేకంగా అధికారుల బృందం ఢిల్లి వెళ్లింది. 10రోజులపాటు ఢిల్లిలోనే అధికారులు మకాం వేయనున్నారు.

కేఆర్‌ఎంబీ అంతర్గత సమావేశం..

తెలంగాణ ప్రభుత్వ డిమాండ్లపై చర్చించేందుకు కేఆర్‌ఎంబీ శుక్రవారం అంతర్గత సమావేశం నిర్వహించింది. శ్రీశైలంలో డెడ్‌ స్టోరేజీకి నీరు చేరటం, ఏపీ ప్రభుత్వ నీటి తరలింపుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంపై చర్చించారు. ఏపీని ఎలా దారిలోకి తేవాలన్న విషయంపై సీరియస్‌గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement