Saturday, November 23, 2024

కేంద్రం సిద్ధంగానే ఉంది రాష్ట్రం నుంచే చర్యల్లేవు.. తెలంగాణలో విమాశ్రయాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచే తగిన చర్యలు లేవని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకు రాసిన బహిరంగ లేఖలో వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి, జక్రాన్‌పల్లి వద్ద కొత్త విమానాశ్రయం ఏర్పాటు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తన పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని సంబంధిత శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గత ఏడాది అక్టోబర్ 6న రాసిన లేఖను కిషన్ రెడ్డి తన లేఖతో పాటు జతపరిచారు. రాష్ట్రంలోని నూతన విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పురోగతి చాలా స్వల్పమని అన్నారు. ఆయా విమానాశ్రయాలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో పాటు విమానాశ్రయాలలో కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన రెగ్యులేటరీ అనుమతులు వంటి అంశాల్లో ఏ మాత్రం పురోగతి సాధించకపోవడం చాలా విచారకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే మూడు విమానాశ్రయాల తాజా స్థితిగతుల గురించి లేఖలో వివరించారు.

  1. వరంగల్ విమానాశ్రయం

748 ఎకరాలలో విస్తరించి ఉన్న వరంగల్ విమానాశ్రయం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పరిధిలో ఉంది. ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. అక్కడ ఎటువంటి కార్యకలాపాలను సాగించడానికి వీల్లేకుండా ఉంది. ఈ విమానాశ్రయంలో విమానాలు రాకపోకలు సాగించటానికి వీలుగా అడ్డంకులను తొలగించి, కావలసిన మరమ్మత్తులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఈ విమానాశ్రయం మొదటి దశ అభివృద్ధి పనులకు 27.7 ఎకరాలు, రెండవ దశ అభివృద్ధి పనులకు 333.86 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది

  1. అదిలాబాద్ విమానాశ్రయం

వాణిజ్య విమానాలు రాకపోకలు సాగించటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రన్ వే కు సంబంధించిన అప్రోచ్ ఫన్నెల్‌తో పాటు ఆ మార్గంలో ఉన్న 100కు పైగా అడ్డంకులను తొలగించాలి. అనుకుంట గ్రామానికి అదిలాబాద్ పట్టణంతో కలిపే రోడ్డును దారి మళ్లించాలి. మొదటి దశ అభివృద్ధి పనులకు 122 ఎకరాలు, రెండవ దశ అభివృద్ధి పనులకు 175 ఎకరాల భూమిని సమీకరించాల్సి ఉంది.

  1. జక్రాన్ పల్లి విమానాశ్రయం

ఇది గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం. వాణిజ్య విమానాలు రాకపోకలు సాగించటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తొలుత విమానయాన మంత్రిత్వ శాఖ నుండి అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. విమానాశ్రయం నిర్మించే స్థలంలోని అడ్డంకులను తొలగించి, భారత వాయుసేన(IAF) నుండి అనుమతులు తీసుకోవాలి. ఈ విమానాశ్రయం మొదటి దశ అభివృద్ధిపనులకు ఇది వరకే చూపించిన స్థలంలో 510 ఎకరాలు మరియు రెండవ దశ అభివృద్ధి పనులకు 235 ఎకరాలను సమీకరించవలసి ఉంటుంది. సాంకేతికంగా, ఆర్థికంగా పై మూడు విమానాశ్రయాలకు సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికలను కూడా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 2021 జూన్ 17న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.

తెలంగాణ రాష్ట్రంలో పై మూడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయటంలో అవసరమైన సహకారాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఇది వరకే తెలియజేసినందున, ఆ సహకారాన్ని అందిపుచ్చుకుని, రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనులను వీలయినంత త్వరగా పూర్తి చేసినట్లయితే తెలంగాణలో మరో మూడు విమానాశ్రయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement