Thursday, November 21, 2024

అదానీ వ్యవహారంతో కమిటీకి కేంద్రం ఓకే

అదానీ గ్రూప్‌ వ్యవహారంలో సుప్రీం కోర్టు సూచనను కేంద్రం ఆమోదించింది. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు కొని తీవ్రంగా నష్టపోయిన మదుపర్ల రక్షణకు, ఇలాంటివి మళ్లి జరగకుండా ఉండేందుకు నిపుణుల కమిటీని నియమించాలన్న సుప్రీం కోర్టు సూచించింది. స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అధికారాలను మరింత పటిష్ట పరిచేందుకు సుప్రీం ఈ కమిటీని నియమించాలని కోరింది. దీనిపై స్పందించాలని కేంద్రాన్ని, సెబీని సుప్రీం కోర్టు కోరింది. కమిటీ సభ్యుల పేర్లను సీల్డ్‌ కవర్‌లో అందిస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

అదానీ గ్రూప్‌ షేర్లను కృత్రిమంగా పెంచిందని, ఎకౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్‌ షేర్లన్నీ భారీగా పతనమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతున్నది.

సోమవారం నాడు జరిగిన విచారణకు కేంద్ర ప్రభుత్వం, సెబీ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరయ్యారు. కమిటీ పేర్లను త్వరలోనే కోర్టకు అందిస్తామని ఆయన తెలిపారు. విస్తృత ప్రయోజనాల రీత్యా ఈ పేర్లను సీల్డ్‌ కవర్‌లో అందిస్తామని ధర్మాసనానికి ఆయన తెలియజేశారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం తలెత్తిన పరిస్థితులపై సెబీతో పాటు ఇతర అత్యున్నత సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు.

- Advertisement -

హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత అదానీ గ్రూప్‌ పతనమై లక్షల కోట్లు నష్టపోవడం పట్ల సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు ముఖ్యమని, ఇలాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీం కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక నిపుణుల కమిటీ వేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. సుప్రీం చేసిన ఈ సూచనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తూ, సుప్రీం కోర్టుకు తెలియజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement