కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇంధన సామర్థ్య విధానాలను కేంద్రం ప్రశంసిస్తోంది. ఈ విధానాలను సమర్థంగా అమలు చేస్తున్న దేశంలో టాప్ టెన్ రాష్ట్రాల్లో ఏపీకి చోటు లభించింది. జాతీయ వాతావరణ మార్పులకు సంబంధించి కేంద్ర ఇంధనశాఖ ప్రత్యేక గుర్తింపునిస్తోంది. ఇందులో భాగంగా 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఇప్పటినుండే కార్యాచరణను రాష్ట్రాలకు నిర్దేశించింది. కేంద్ర ఇంధన శాఖ ఇప్పటికే 150 మిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2030 నాటికి బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా ఏపీకి 6.68 మిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. దీనికి అనుగుణంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ ద్వారా రాష్ట్ర ఇంధన సామర్థ్య కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక వెబినార్ జరిగింది. ఈ సందర్భంగా, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో కేంద్ర విద్యుత్ శాఖ ఇంధన సామర్థ్య చర్యలపై నిర్ధిష్టమైన ప్రణాళికలు గురించి వివరించింది.
జగనన్న ఇళ్లలో ఈఎన్‌ఎస్ ప్రోగ్రాం..
దశలవారీగా 28.3 లక్షల ఇళ్లలో జగనన్న కాలనీల భారీ గృహ నిర్మాణ పథకంలో ఇంధన సామర్థ్య చర్యలను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి చేసిన ప్రెజెంటేషన్‌పై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పూర్తిస్థాయి సంతృప్తిని వ్యక్తంచేశారు. 2030 నాటికి రాష్ట్ర ఇంధన పొదుపు లక్ష్యమైన 6.68 ఎంటీఓఈ చేరుకోవడానికి కీలక శాఖలతో సమన్వయం చేసుకొని ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేయాలనీ, ఎకో నివాస్ సంహిత (ఈఎన్‌ఎస్)ని రాష్ట్ర బిల్డింగ్ బైలాస్‌లో చేర్చాలని కోరారు.
ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటులోనూ ముందంజ..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఇంధన సామర్థ్యం కోసం స్టాండలోన్ ఎస్డీయేను ఏర్పాటు చేసిన అగ్రగామి రాష్ట్రాలలో ఏపీ ఒకటి అని కూడా శ్రీకాంత్ తెలిపారు. వీధి దీపాల జాతీయ కార్యక్రమం (ఎస్‌ఎల్‌ఎన్‌పీ) అమలులో ఏపీ పట్టణ ప్రాంతాల్లో 6.02 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 23.54 లక్షల ఎల్ ఈ డీ వీధి దీపాలను ఏర్పాటు చేయడంలో ముందంజలో ఉందని వివరించారు. అలాగే పాట్ (పీఏటీ) సైకిల్-2లో 3430 మిలియన్ యూనిట్లకి సమానమైన 0.295 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ను ఆదా చేసిందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..