Thursday, November 21, 2024

AP | రాష్ట్రానికి మరో గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్రం.. 4,787 కోట్ల విడుదలకు అంగీకారం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే రెండు తీపి కబర్లు చెప్పిన కేంద్రం, తాజాగా మరో తీపి కబురు చెప్పింది. కేంద్రం నుండి రాష్ట్రాలకు రావల్సిన పన్నుల వాటా మూడో విడత నిధులను విడుదల చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇందులో భాగంగా కేంద్రం నుండి రాష్ట్రానికి రూ.4, 787 కోట్లు రానున్నాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రాలు తమ మూల ధన కేటాయింపులను వేగవంతం చేయడానికి, అభివృద్ధి, సంక్షేమ సంబంధిత వ్యయాలకు అవసరమైన ఆర్థిక సహాయం చేయడానికిఈ నిధులను విడుదల చేసినట్లు- తెలిపింది. ప్రాధాన్యత క్రమంలో చేపట్టిన ప్రాజెక్టులు, పథకాల కింద వ్యయం చేయడానికి వీలుగా జూన్‌ నెలకు సంబంధించిన మొత్తాన్ని అడ్వాన్స్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద విడుదల చేసినట్లు వివరించింది.

దీంతో కేంద్రం నుండి నిధులను రాబట్టే విషయంలో సీఎం జగన్‌ సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణ వైఖరికి వెళ్లకుండా తనకు కావాల్సిన పనులన్నింటినీ జగన్‌ చేయించుకుంటూ, నిధులను తెప్పించుకుకోవడంలో విజయం సాధిస్తున్నారు. రెవెన్యూ లోటు బడ్జెట్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రానికి రూ.10,461 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌ కోసం రూ.12,911 కోట్లను యుద్ధ ప్రాతిపదికన కేటాయించింది. రాష్ట్రానికి జీవనాడిగా భావించే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు మంజూరు చేయడంతో పనులు ఊపందుకున్నాయి.

- Advertisement -

అదే ఊపులో సీఎం జగన్‌ స్వయంగా పోలవరం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గోదావరిలో వరదల కారణంగా కాఫర్‌ డ్యామ్‌ కొట్టుకుపోవడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అదనంగా రూ.2 వేల కోట్లు కావాలని చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించి ఆ నిధులను మంజూరు చేయడానికి అంగీకరించింది. పాలనాపరమైన అనుమతులను జారీ చేసింది. ఈ రూ.2 వేల కోట్లు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో బిగ్‌ న్యూస్‌ చెప్పింది. రూ.4,787 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను పంపిణీలో భాగంగా మూడవ విడత కింద దేశ వ్యాప్తంగా రూ.1,18,280 కోట్లను కేంద్రం విడుదల చేయగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా రూ.4,787 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రాలవారీగా నిధులు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, అరుణాచల్‌ ప్రదేశ్‌- రూ.2,078 కోట్లు, అస్సాం- రూ.3,700, బిహార్‌- 11,897 కోట్లు, ఛత్తీస్గఢ్‌- రూ.4,030 కోట్లు, గోవా- రూ. 457 కోట్లు, గుజరాత్‌- రూ. 4,114 కోట్లు, హర్యానా- రూ.1,293 కోట్లు, హిమాచల్‌ ప్రదేశ్‌- రూ. 982 కోట్లు, జార్ఖండ్‌- రూ. 3,912 కోట్లు, కర్ణాటక- రూ. 4,314 కోట్లు, కేరళ- రూ. 2,277 కోట్లు, మధ్యప్రదేశ్‌- రూ. 9,285 కోట్లు, మహారాష్ట్ర- రూ. 7,472 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది.

మణిపూర్‌- రూ.847 కోట్లు, మేఘాలయా- రూ.907 కోట్లు, మిజోరం- రూ.591 కోట్లు, నాగాలాండ్‌- రూ.673 కోట్లు, ఒడిశా- రూ.5,356 కోట్లు, పంజాబ్‌- రూ.2,137 కోట్లు, రాజస్థాన్‌- 7,128 కోట్లు, సిక్కిం- రూ.459 కోట్లు, తమిళనాడు- రూ.4,825 కోట్లు, తెలంగాణ- రూ. 2,486 కోట్లు, త్రిపుర- రూ.837 కోట్లు, ఉత్తరప్రదేశ్‌- రూ. 21,218 కోట్లు, పశ్చిమ బెంగాల్‌- రూ.8,898 కోట్ల రూపాయలను కేంద్రం తాజగా విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ నోట్‌ విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement