Tuesday, November 26, 2024

చివరి గింజ దాకా కేంద్రమే కొంటది.. పుత్ర వాత్సల్యంతో కేసీఆర్​ బీజేపీపై కుట్ర: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణాలో పండిన ధాన్యాన్ని ఒప్పందం ప్రకారం చివరి గింజ వరకు కేంద్రమే కొంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని చూస్తుంటే జాలేస్తోందని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ రైతులను బలి చేస్తోందని అన్నారు. కేసీఆర్ పుత్ర వాత్సల్యంతో బీజేపీపై కుట్రతో ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేస్తూ రైతులను ముంచుతున్నారని ఆరోపించారు. బాయిల్డ్ రైస్ పంపించబోమని గతేడాది లేఖ పంపారని, అన్ని రాష్ట్రాల ధాన్యం సేకరణపై గత నెల ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తే హాజరుకాకపోగా, కేంద్రానికి కనీస సమాచారం ఇవ్వలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. చేసుకున్న ఒప్పందం ప్రకారం బియ్యం కొనుగోలు చేస్తామని ఇప్పటికీ కేంద్రం చెప్తోందని, గతంలో ఇచ్చిన టార్గెట్ ఇంకా తెలంగాణ పూర్తి చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఒకసారి పంజాబ్ వెళ్లి అక్కడి పరిస్థితులు చూడాలని సూచించారు. ఎక్కడా ఎఫ్‌సీఐ వడ్లను కొనదని, బియ్యమే కొంటుందని నొక్కి చెప్పారు. ఆంధ్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్‌లలో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోందని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలపై కేసీఆర్‌కి కంట్రోల్ లేక కేంద్రం బియ్యం కొనుగోలు చేయదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ధాన్యం సేకరణపై ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం ఉత్పత్తి చేస్తుందో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చెప్పలేదని అన్నారు. ఎందుకు పంటల సేకరణ విధానం మార్చాలనుకుంటున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు. అన్ని గ్రామాల నుంచి పంటల సేకరణ విధానంపై కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానాలు రాబోతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం తీర్మానాల కాపీలను పంపిణీ చేశాయని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉన్నపుడు ప్రత్యేక చట్టమంటూ ఉండదన్నారు. కేసీఆర్ ఒక్కో ప్రాంతానికి ఒక్కో చట్టం అమలు చేస్తారని ఆయన విమర్శించారు.

తెలంగాణ మంత్రులు కేంద్రమంత్రిని సన్నాసి అని మళ్లీ ఆయన దగ్గరకే వెళ్లారని కిషన్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను పీయూష్ గోయల్ అవమానపరచలేదని… పీయూష్ గోయల్‌నే తెలంగాణ మంత్రులు అవమానపరిచారని వివరించారు. మంత్రులు కేంద్రమంత్రిని కలుస్తున్నప్పుడు తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. హుజురాబాద్ ఎన్నిక అడ్డు పెట్టుకుని కుటుంబ ప్రతిష్ట నిలబెట్టుకోవాలనుకుంటున్నారని, బీజేపీని తరిమి కొడతామన్నాక యూపీ, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో గెలిచామని, అలాగే తెలంగాణా కూడా గెలిచి చూపిస్తామని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. పెట్రోల్‌పై అన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గిస్తే కేసీఆర్ ఎందుకు తగ్గించలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఉక్రెయిన్ పరిణామాల వల్ల చమురు ధరలు పెరగడంతో కేంద్రానికి నష్టం వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. సైనిక్ స్కూల్, ఎంఎంటీఎస్ ,ట్రైబల్ మ్యూజియం సహా కేంద్రం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం లేదని ధ్వజమెత్తారు.

తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక ఉత్సవాలు..

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుమతిచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. నేడు(26) రాజమహేంద్రవరంలో గోదావరి నది తీరంలో ఉత్సవాలు జరుగుతాయని, ఏపీ గవర్నర్ ఉత్సవాలు ప్రారంభిస్తారని, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. రాజమండ్రిలో జరిగే రాష్ట్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఉత్సవాల్లో తనతో పాటు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొంటున్నారని వెల్లడించారు. ఉత్సవాలు జరుగుతున్న రాష్ట్రం నుంచి 25 శాతం కళాకారులు పాల్గొంటారని, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాల కళాకారులు తమ కళలు ప్రదర్శిస్తారని అన్నారు. మార్చి 29, 30 తేదీల్లో వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో జరిగే ఉత్సవాలను తెలంగాణా గవర్నర్ తమిళిసై ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు వెయ్యి మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు.

- Advertisement -

ఏప్రిల్ 1,2,3 తేదీల్లో ఎన్టీఆర్ గార్డెన్స్‌లో రాష్ట్రీయ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా గవర్నర్లు రాష్ట్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇటీవల పద్మ పురస్కారాలు అందుకున్న ప్రముఖులు తమ కళలను ప్రదర్శిస్తారని తెలిపారు. మూడేళ్ల క్రితం బెంగాల్, అంతకు ముందు మధ్యప్రదేశ్‌లో రాష్ట్రీయ సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయని గుర్తు చేశారు. అనేక మంది సంగీత విద్వాంసులు, గాయని గాయకులను తెలుగు రాష్ట్లాల ఉత్సవాలకు ఆహ్వానించామని, అలాగే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోటోకాల్ ప్రకారం సమాచారమిచ్చామని కిషన్‌రెడ్డి వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement