Friday, November 22, 2024

టీచర్ల బదిలీలు, పదోన్నతుల కేసు మళ్లి వాయిదానే.. టీచర్లలో అసంతృప్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన కేసు సోమవారానికి కొలిక్కి వస్తుందని టచర్లంతా భావించారు. కానీ కేసు మళ్లి వాయిదా పడడంతో ఉపాధ్యాయ వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది. స్టే వెకేట్‌ అయి టీచర్ల బదిలీలు, పదోన్నతులకు ఇక లైన్‌ క్లియర్‌ అవుతుందని అనుకున్నారు. కోర్టు స్టే పొడిగిస్తూ మరో వారం రోజులపాటు కేసును హైకోర్టు వాయిదా వేయడంతో టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది. ఈలోపు ఎన్నికల కోడ్‌ వస్తే ఎలా? అని టీచర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జీవో నెం.5కు విడుదల చేసి టీచర్ల బదిలీలు, పదోన్నతులకు ప్రక్రియను గతంలోనే మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

అయితే ఆ జీవోకు చట్టబద్ధత లేదని, స్పౌజ్‌ పాయింట్లపై, టీచర్‌ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన స్పెషల్‌ పాయింట్లు తదితర అంశాలపైన కొంత మంది ఉపాధ్యాయులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. వాటిపై విచారణను హైకోర్టు గత నాలుగైదు నెలలుగా చేపడుతోంది. కాగా, అసెంబ్లి ఆమోదం పొందని, చట్టబద్ధతలేని జీవో నెం.5 ద్వారా ఏవిధంగా ప్రమోషన్లు, బదిలీలు చేపడతారని పిటిషనర్లు వాదిస్తూ వచ్చారు. ఆ జీవోకు చట్టబద్ధత కల్పించాలని భావించిన ప్రబుత్వం ఇటీవల జరిగిన శాసనసభా సమావేశాల్లో జీవో నెం.5కు చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లి ఆమోదించింది.

చట్టబద్ధత లభించడంతో ఇక బదిలీల ప్రక్రియ యథాతధంగా కొనసాగుతోందని అటు ప్రభుత్వం, ఇటు ఉపాధ్యాయులు భావించారు. సోమవారం కోర్టులో కేసు విచారణ ఉండంతో బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన స్టే వెకేట్‌ అయి మార్గం సుగమం అవుతుందని ఆశించారు. ఇందులో భాగంగా కోర్టుకు జీవో నెం.5 చట్టబద్ధత దస్త్రాన్ని అధికారులు కోర్ట్‌కి సమర్పించారు కూడా. అయితే ఆ ఫైల్‌ స్టడీ కోసం పిటిషనర్‌ తరుపు న్యాయవాది ఒక వారం రోజుల సమయాన్ని అడిగారు. దీంతో కోర్టు ఒక వారం రోజులు కేసును వాయిదా వేసింది.

- Advertisement -

వచ్చే సోమవారం ఈ కేసు విచారణకు రానుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశానికి సంబంధించిన ఉత్కంఠకు సోమవారంతో తెరపడుతుందనుకున్న ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. మరో వారం రోజుల వరకు ఇదే సస్పెన్స్‌ కొనసాగనుంది. అసెంబ్లిలో జీవో నెం.5కు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో పున:ప్రారంభమవుతుందని భావించారు. దీంతో ముందే ఉపాధ్యాయులు సంబరాలు కూడా చేసుకున్నారు.

తీరా కేసు విచారణ జరిగి మళ్లి వాయిదా పడడంతో ఉపాధ్యాయులు నిరాశకు లోనయ్యారు. ఫిబ్రవరీ నుంచీ ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అటు ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టి ముగించేయాలని భావిస్తోంది. ఈక్రమంలోనే ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి మేరకు జీవో నెం.5కు చట్టబద్ధతను కల్పిస్తూ అసెంబ్లిdలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారమైన ఈ కేసు కొలిక్కి వచ్చి బదిలీలకు లైన్‌క్లియర్‌ అవుతుందో లేదోనని ఉపాధ్యాయులు ఆశగా వేచిచూస్తున్న పరిస్థితి నెలకొంది. బదిలీల కోసం సుమారు 73వేల మంది ఉపాధ్యాయులు, పదోన్నతుల కోసం సుమారు 10 వేల మంది టీచర్లు ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement