న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మహిళలను విచారణ జరిపే విషయంలో సీఆర్పీసీ నిబంధనలు తమకు వర్తించవని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టులో తెలిపింది. మహిళలను ఈడీ కార్యాలయానికి విచారణకు పిలవడంతో పాటు ఈడీ దర్యాప్తు విధానాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాదులు ఈ విషయం చెప్పారు. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం ఎదుట కవిత దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌధురి హాజరయ్యారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హాజరయ్యారు. తొలుత సిబల్ మాట్లాడుతూ.. ఏ కేసులోనైనా మహిళను సాక్షిగా ప్రశ్నించాలని అనుకుంటే అనుసరించాల్సిన విధానాలు వేరుగా ఉంటాయని, కానీ ఈడీ వాటిని అమలు చేయలేదని ఆరోపించారు. మహిళను ఆమె ఇంటి వద్దనే ప్రశ్నించాలా లేక ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించాలా అన్న విషయంపై నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసుల్లో కోర్టు విచారణ జరుపుతోందని, అయితే ఇంతకు మించి చెప్పాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని సిబల్ అన్నారు.
ఈదశలో జోక్యం చేసుకున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, సీఆర్పీసీ సెక్షన్ 160 నిబంధనలు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) చట్టానికి వర్తించవని, విజయ్ మదన్‌లాల్ కేసుతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే ఈ విషయం స్పష్టం చేశారని గుర్తుచేశారు. సమన్లు జారీ చేసే విషయంలో సీఆర్పీసీలోని చాప్టర్ 12 కూడా వర్తించదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 చాప్టర్ 12లో అంతర్భాగమేనని ఎస్వీ రాజు తెలిపారు. విజయ్ మదన్‌లాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన చదివి వినిపించారు. ఈ క్రమంలో మనీ లాండరింగ్ మహిళలను ప్రశ్నించే విషయంలో న్యాయస్థానం ముందు ఎలాంటి సందగ్థత లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ.. ఇన్వెస్టిగేషన్‌కు, ఎంక్వైరీకి మధ్య వ్యత్యాసాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో అప్పటికే ఫిర్యాదులు నమోదయ్యాయని, కేసు ప్రాథమిక విచారణ దశలో లేదని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కోసమే సమన్లు జారీ చేశారు తప్ప ప్రాథమిక విచారణ కోసం కాదని అన్నారు. మనీ లాండరింగ్ చట్టంలోని చాప్టర్ 8 చూస్తే ఈ తేడా స్పష్టమవుతుందని చెప్పారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ఏఎస్జీ విజయ్ మదన్‌లాల్ కేసులో వీటన్నింటి గురించి వాదనలు జరిగాయని అన్నారు.
దాదాపుగా ఇలాంటి అభ్యంతరాలపై గతంలో దాఖలైన నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో ఈ పిటిషన్‌ను జతకలిపి విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది. అయితే వాటితో కలపడాన్ని సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు. అభిషేక్ బెనర్జీ కేసు పూర్తిగా వేరు అని చెప్పారు. ఈడీ న్యాయవాదుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం, కేసును నళిని చిదంబరం కేసుతో ముడిపెడుతూ విచారణ 3 వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
మద్యం కేసుపై సిట్ ఏర్పాటు చేయాలి : కవిత
మద్యం పాలసీ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని ఈ కేసులో పిటిషనర్ కవిత తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు. మార్చి 14న దాఖలు చేసిన తన పిటిషన్‌కు అదనంగా 4 ఇంటర్‌లాక్యుటరీ అప్లికేషన్ (ఐఏ)లు దాఖలు చేసిన ఆమె అందులో స్టే అప్లికేషన్‌తో పాటు అదనపు అంశాలను జోడించారు. ఈ క్రమంలో దర్యాప్తుపై రాజకీయ జోక్యం, ప్రభావం లేకుండా ఉండేందుకు న్యాయస్థానం పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని అభ్యర్థించారు. మొదట దాఖలు చేసిన పిటిషన్‌లో ఒక మహిళగా తనకున్న హక్కులను ఈడీ కాలరాస్తోందని ఆమె ఆరోపించారు. సాక్షిగా పిలిచిన మహిళను ఆమె ఇంటి వద్దనే ప్రశ్నించాలని, గతంలో సీబీఐ ఇలాగే వ్యవహరించిందని పేర్కొన్నారు. మరొకరితో కలిపి ప్రశ్నించాలని అనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించవచ్చని సూచించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 160ని ఉల్లఘించి తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరుపుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈడీ అధికారులు కేసుతో ముడిపడ్డ వ్యక్తులను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇదే కేసులో చందన్ రెడ్డిపై అధికారులు చేయిచేసుకున్నారని, ఫలితంగా ఆయన వినికిడి కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈడీ అధికారులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేసిందన్నారు. తదుపరి జరిగే విచారణ ఏదైనా సరే న్యాయవాదుల సమక్షంలో, సీసీటీవీ కెమెరాల నిఘాలో చేపట్టేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఈడీ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా తగిన ఆదేశాలు కూడా ఇవ్వాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు.