Tuesday, November 26, 2024

Delhi | కారు ముక్కలవడం ఖాయం.. కాంగ్రెస్‌ను విమర్శిస్తే ఖబడ్దార్ : ఎంపీ కోమటిరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘కార్ కావాలా.. బేకార్ గాళ్లు’ కావాలా అంటూ అసభ్య పదజాలంతో బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. గ్యారంటీ, వారంటీ తీరిపోయింది కాంగ్రెస్ పార్టీకి కాదని, పదేళ్లలో అందరికీ పదవులు ఇస్తానన్న డొక్కు కారుకు వారంటీ తీరిపోయి, ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్‌’గా పేరు మార్చారని విమర్శించారు. ఆ పార్టీ నేత లాంగ్వేజి, బాడీ లాంగ్వేజి మారిపోయిందని, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని.. రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.

దేశపతి శ్రీనివాస్ రాసిచ్చిన కొటేషన్స్‌తో కేసీఆర్, కేటీఆర్ డైలాగులు చెబుతున్నారని అన్నారు. రామలింగ రాజు, ఆయన కొడుకు తేజ రాజు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఆ తండ్రీకొడుకులు చెప్పినట్టే కేటీఆర్ నడచుకుంటారని అన్నారు. కేసీఆర్ ఉన్నంతవరకే కార్ ఉంటుందని, ఆ తర్వాత ముక్కలవడం ఖాయమని కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ (కవిత), బీఆర్ఎస్ (కేటీఆర్), బీఆర్ఎస్ (హరీశ్) అంటూ ముక్కలు ముక్కలుగా చీలిపోతుందని జోస్యం చెప్పారు.

పార్టీని గెలిపించండి.. పదవులు అందరికీ వస్తాయి

ఆదివారం ఉదయం ఏఐసీసీ విడుదల చేసిన తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాపై స్పందిస్తూ.. రిజర్వుడు స్థానాలు మినహా 12 సీట్లు బీసీలకు, 3 సీట్లు మైనారిటీలకు దక్కాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీసీలకు కేసీఆర్ ఇచ్చిన సీట్ల కంటే తాము ఓ 4 సీట్లు ఎక్కువే ఇస్తామని తెలిపారు. టికెట్లు ఆశించి దక్కించుకోలేకపోయినవారు నిరాశ చెందవద్దని, టికెట్ రాకున్నా తమకు వచ్చినట్టే భావించి పార్టీని గెలిపించడం కోసం ఈ క్షణం నుంచే పనిచేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటైతే పదవులు చాలా ఉంటాయని, అందుకే ముందు పార్టీని గెలిపించడం కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

- Advertisement -

ఎమ్మెల్సీ, ఎంపీ, నామినేటెడ్ పదవులు చాలానే ఉంటాయని గుర్తుచేశారు. ఎన్ని కేసులు పెట్టినా సరే బెదరకుండా పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, నేతలందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. టికెట్లు దక్కని నేతలను తాను ఢిల్లీకి తీసుకొచ్చి అధిష్టానం పెద్దలతో భేటీ ఏర్పాటు చేస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. తదుపరి విడుదల చేసే జాబితాలో కూడా సామాజిక సమతూకం ఉండేలా అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు.

కాంగ్రెస్ గెలిచే సీట్లు లెఫ్ట్ పార్టీలు కోరుతున్నాయి.. మిర్యాలగూడ వద్దు.. మునుగోడు తీసుకోండి

సీపీఐ, సీపీఐ(ఎం)తో పొత్తుల కారణంగా స్థానిక నాయకత్వం అసంతృప్తికి లోనవుతుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. స్థానికంగా ఈ రెండు పార్టీలతో పొత్తుల కారణంగా నష్టమే అయినప్పటికీ జాతీయస్థాయిలో విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాబట్టి తాము గౌరవిస్తామని తెలిపారు. అయితే లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ గెలిచే సీట్లను కోరుతున్నాయని, అది సరికాదని అన్నారు.

ఉదాహరణకు నల్గొండ జిల్లాలో ‘మిర్యాలగూడ’ స్థానంలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని, ఆ సీటును సీపీఐ(ఎం) కోరుతోందని తెలిపారు. దాని బదులు ‘మునుగోడు’ తీసుకోమని సూచించారు. మునుగోడులో కమ్యూనిస్టులు బలంగా ఉన్నారని, వారి బలంతోనే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిందని గుర్తుచేశారు. మరోవైపు వైఎస్ షర్మిల పార్టీ విలీనం లేదా పొత్తుల గురించి ప్రశ్నించగా.. ‘నో కామెంట్’ అని బదులిచ్చారు.

నీడనిచ్చే చెట్టును నరుక్కుంటారా?

పార్టీలో సీనియర్ నేత, 40 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారడం బాధాకరం అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ వీడి వెళ్తూ నిందలు వేయడం సరికాదని అన్నారు. అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చిన పొన్నాలకు ‘డాలర్ లక్ష్మయ్య’ అని పేరుందని, ఆయనకు వచ్చిన గుర్తింపు కాంగ్రెస్ పార్టీతోనే అన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. “ఈరోజు టికెట్ రాకపోతే రేపు రాజ్యసభ వచ్చేదేమో. అయినా టికెట్లు ఇచ్చేది రాష్ట్ర నాయకత్వం కాదు. అధిష్టానం అన్న విషయం నీకు తెలియదా? ఇన్నాళ్లుగా నీడనిచ్చిన చెట్టునే నరుక్కుంటావా?” అంటూ పొన్నాలను ఉద్దేశించి ప్రశ్నించారు.

పీసీసీ అధ్యక్షుణ్ణి తిడితే హైకమాండ్‌ను తిట్టినట్టేనని, పీసీసీ చీఫ్ ఒక సమన్వయకర్తలా మాత్రమే పనిచేస్తారని అన్నారు. పొన్నాల వంటి నేతలు పార్టీలో ఉన్నా, లేకున్నా పెద్ద నష్టమేమీ లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ఆయన తన నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో లేరని, తాను అనేక మందికి సహాయం చేశానని కోమటిరెడ్డి చెప్పారు. నాలుగేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండి, ఇప్పుడొచ్చి టికెట్ అడిగితే ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో నిరసన తెలిపితే తప్పేంటి?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో ఐటీ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. “పాకిస్తాన్ గురించి హైదరాబాద్‌లో నిరసన తెలపడం లేదా? ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనపై తెలంగాణలో ధర్నాలు జరగలేదా? హైటెక్ సిటీ, ఇతర ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందినవారు చంద్రబాబు పట్ల కృతజ్ఞతతో నిరసన తెలపాలి అనుకున్నారు. అందులో కేవలం ‘కమ్మ’వారు మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలూ ఉన్నారు. కేటీఆర్ ఎందుకు ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు” అంటూ మండిపడ్డారు. ఐటీ ఉద్యోగుల అమెరికా కలను దెబ్బతీసేలా వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement