న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంత ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇందుక్కారణం కరోనా కొత్త వేవ్ కాదు. కోరలు చాచిన వాయు కాలుష్యం ఈ దుస్థితిని తీసుకొచ్చింది. వింటర్ ఎంటరైందంటే చాలు ఢిల్లీలో పీల్చే గాలి విషంగా మారుతుంది. రుతుపవనాల తిరోగమనం అనంతరం ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే మానవ తప్పిదాలు ఈ వాయుకాలుష్యం స్థాయులను మరింత పెంచి పీల్చేగాలిని విషతుల్యం చేస్తున్నాయి. ఢిల్లీ నగరంలోని వాహన ఉద్గారాలకు తోడు పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే పొగ శీతాకాలంలో సహజసిద్ధంగా ఏర్పడే పొగమంచులో కలిసిపోయి ఊపిరి పీల్చుకోలేని ఉక్కిరిబిక్కిరి పరిస్థితిని సృష్టిస్తున్నాయి. భవన నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే దుమ్ము, ధూళి అన్నీ కలగలిపి గాలి నాణ్యతను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ ఇప్పటికే 400 దాటిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఢిల్లీ నగరం ప్రపంచ కాలుష్య రాజధానిగా మారిందంటే అతిశయోక్తి కాదు.
పాఠశాలలు మూసేయండి: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచన
ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు పాఠశాలలను మూసివేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. పిల్లల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దేశ రాజధానిలో వాయు నాణ్యత మెరుగయ్యే వరకు పాఠశాలలను మూసివేసే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి తగ్గించేందుకు అత్యవసర ప్లాన్‌ను సిద్ధం చేయాలని కోరింది.
సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ రీసెర్చ్ డేటా ప్రకారం గురువారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటింది. మరికొద్ది రోజులు సైతం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా వయోజనులు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఢిల్లీ మంత్రి గోపాల్‌రాయ్ ఉద్యోగులు ఇండ్ల నుంచి పని చేయాలని, ప్రైవేటు వాహనాలను వినియోగించకుండా ప్రజా రవాణాను వినియోగించాలని సూచించారు.
గత ఏడాది సైతం వాయుకాలుష్యం తీవ్రత నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీచేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెండు రోజుల పాటు లాక్‌డౌన్ విధించైనా సరే కాలుష్యాన్ని తగ్గించాలని స్పష్టం చేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 నుంచి 200 తగ్గించేలా ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు నోటిసులపై స్పందించిన కేజ్రీవాల్ ప్రభుత్వం వారంపాటు స్కూళ్లు మూసేసింది. అంతేకాకుండా వ్యాపార, నిర్మాణ తదితర పనులన్నీ నిలిపేశారు. ప్రభుత్వ కార్యాలయ సిబ్బందికి కూడా వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించింది. ఇప్పుడు తాజాగా పెరుగుతున్న వాయుకాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్మాణ కార్యాకలాపాలపై నిషేధం విధించింది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సైతం తరగతులను రద్దు చేశాయి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్-95 మాస్కులను వినియోగించాలని సూచిస్తున్నాయి. పెరుగుతున్న వాయుకాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను మూసేసి ఆన్‌లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలని ఆదేశించే అవకాశం ఉంది.