తెలంగాణ సచివాలయంలో ఈరోజు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. కాగా, ఈ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ముఖ్యంగా హైడ్రాకు మిగిలిన శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ఈ మేరకు నిబంధనలను సడలించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక కోఠి మహిళా, తెలుగు విశ్వవిద్యాలయం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ యూనివర్సిటీలకు పేర్ల మార్పునకు తెలంగాణ కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపిందని వివరించారు.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలివే..
- హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం.
- 51 గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోకి వస్తాయని పేర్కొన్న కేబినెట్.
- ఆర్ఆర్ఆర్ ను ఖరారు చేసేందుకు 12 మందితో కమిటీని ఏర్పాటు.
- ఆర్ఆర్ఆర్ కమిటీ కన్వినర్‌గా ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ.
- కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం.
- తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం.
- హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇనిస్టిట్యూట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం.
- సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయం.
- మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ హబ్ కు కేబినెట్ ఆమోదం.
- ఎస్ఎల్బీసీ టన్నెల్ రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు కేబినెట్ ఆమోదం.
- టన్నెల్ పనులకు రూ.4637 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.