యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 91 మంది పేర్లను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. గోరఖ్‌పూర్ రీజియన్‌లో 11 సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించారు. గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగీ ఆదిత్యనాథ్ పోటీ చేయనుండటంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే ముందే ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. యోగీ తొలి అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 11 స్థానాలకు అభ్యర్థులను మార్చినట్టు బీజేపీ నేతలు తెలిపారు. యోగీపైనే అందరు ఆశలు పెట్టుకున్నారు. గతంలో పార్టీ ఓడిపోయిన నాలుగు స్థానాల అభ్యర్థులను కూడా మార్చారు. వృద్ధాప్యం కారణంగా.. లేదా అధికార వ్యతిరేకతను వారు ఎదుర్కొన్నారు. 2017లో పార్టీ సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ వారితో కూడా యోగీ ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు.
ఎక్కువ మంది కొత్త ముఖాలే..
మార్చి 3, మార్చి 7వ తేదీల్లో గోరఖ్‌పూర్ రీజియన్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 62 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 37 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇందులో 43 శాతం మంది కొత్త ముఖాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 295 మంది పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో 56 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చింది. బీజేపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌లో యోగీ సభ్యుడిగా ఉన్నాడు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అన్ని భేటీల్లో యోగీ పాల్గొన్నారు. ఇందులో బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ఉన్నారు. 2017లో యోగీ ఆదిత్యనాథ్ ఓ ఎంపీగా ఉన్నాడు. పరిధి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అసెంబ్లి స్థానం కావడంతో.. గెలుపు ఖాయమని గోరఖ్‌పూర్ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు కేటాయించని స్థానాల్లో అదే వర్గానికి చెందిన కొత్త అభ్యర్థిని బరిలోకి దించినట్టు చెబుతున్నారు. గోరఖ్‌పూర్‌లోని ఖజ్నీ (రిజర్వ్డ్) నియోజకవర్గం నుంచి రెండు సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సంత్ ప్రసాద్.. పక్కనే ఉన్న సంత్ కబీర్‌నగర్ జిల్లాలోని ఘంగాటా స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరామ్ చహాన్తో భర్తీ చేయబడ్డారు. ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో చహాన్ మంత్రిగా ఉన్నారు. తనను రీ ప్లేస్ చేసినా.. ఎలాంటి అభ్యంతరం లేదని.. 1980 నుంచి బీజేపీ కార్యకర్తగా ఉన్నట్టు వివరించారు. 1996లో ఎమ్మెల్యేగా గెలిచినట్టు తెలిపారు. 2012, 2017లో వరుసగా విజయం సాధించానని వివరించారు. నియోజకవర్గంలో బెల్దార్ కమ్యూనిటీ ఓటర్లు 60వేలకు పైగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
గోరఖ్‌పూర్‌కు యోగీ..
గోరఖ్‌పూర్‌కు సంబంధించిన బీజేపీ నేతలతో సీఎం యోగీ ఆదిత్యనాథ్ శనివారం ఆన్లైన్ వేదికగా సమావేశం అయ్యారు. తన గెలుపు బాధ్యతలు మీవే అంటూ చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 2న సీఎం యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ వెళ్తున్నారు. నాలుగు రోజుల పాటు అక్కడే మకాం వేస్తారు. ఈ సందర్భంగా వివిధ సామాజిక వర్గాల నేతలతో ఆయన భేటీ అవుతారు. ఫిబ్రవరి 4వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలుబడలేదు. ఫిబ్రవరి 2వ తేదీన యోగీ ఆదిత్యనాథ్ సాయంత్రం 6 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటారు. అదే రోజు రాత్రి బూతు స్థాయి అధ్యక్షులు, పార్టీ నేతలతో భేటీ అవుతారు. మహానగర్ బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి వివిధ వర్గాల నేతలతో భేటీలు ప్రారంభం అవుతాయి. ఉపాధ్యాయులు, వ్యాపారులు, బౌద్ధ వర్గానికి చెందిన వారిని కలుస్తారు. ఈ భేటీలు సరస్వతీ విద్యా మందిర్, గోరఖ్‌పూర్ క్లబ్, నేపాల్ క్లబ్, గోకుల్ గెస్ట్ హౌస్, ఎంపీ కాలేజీలోని బలరాంపూర్ హాల్లో ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..