పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీని ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే లభ్‌సింగ్ ఉగోక్ తల్లిపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఐకాన్ అని, ఎంతో మందికి ఆదర్శమని ప్రశంలలు కురిపిస్తున్నారు. తన కొడుకు ఎమ్మెల్యే అయినా ఆమె ఇప్పటికీ స్వీపర్‌గా పని చేస్తుండడం పట్ల నెటిజన్లు అభినందనలు తెలిపారు. ఆమె స్వీపర్‌గా పని చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. లభ్ సింగ్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అంతకు ముందు నుంచే ఆయన తల్లి బల్దేవ్ కౌర్ ఒక ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో చన్నీపై లభ్ సింగ్ 37,550 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈ క్రమంలో శనివారం కూడా ఆయన తల్లి ఎప్పటిలాగే పాఠశాలకు వచ్చి పనిచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా ”డబ్బు సంపాదించడానికి మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు నా కొడుకు ఏ స్థానంలో ఉన్నాడనేది అనవసరం. నా పనిని నేను వదులుకోను. చీపురు అనేది నా జీవితంలో అత్యంత ప్రధానమైన వస్తువు. అనుకోకుండా నా కొడుకు అదే గుర్తుపై గెలిచాడు. ముఖ్యమంత్రిపై పోటీ చేసినప్పుడే గెలుస్తాడని అనుకున్నాం. నా కొడుకును గెలిపించిన వారి కోసం పనిచేస్తాడు. వారి కోసమే పని చేయాలి. మేము మాలాగే ఉంటాం. ఇంతకు ముందు ఏం చేశామో ఇప్పుడూ అదే చేస్తాం అని చెప్పుకొచ్చింది.