Saturday, November 23, 2024

21న భారత్‌కు బ్రిటన్‌ ప్రధాని, రెండురోజుల పర్యటన ఖరారు..

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన ఖరారైంది. ఈనెల 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన భారత్‌కు రావడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో బోరిస్‌ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉక్రెయిన్‌కు జాన్సన్‌ గట్టి మద్దతు ఇస్తుండగా భారత్‌ తటస్థవైఖరిని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశమని బ్రిటన్‌ పేర్కొంది. బోరిస్‌ రావడంరావడం గుజరాత్‌లో అడుగుపెడతారు. తన పర్యటనలో భాగంగా తొలిరోజు గురువారంనాడు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులపై కీలక ప్రకటన చేస్తారు. మర్నాడు శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతారు. ఇరుదేశాల వాణిజ్య, ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం చేసే దిశగా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌పై చర్చిస్తారు. 26 చాప్టర్లతో కూడిన ఈ ఒప్పందంలోని నాలుగు అంశాలపై ఇప్పటికే ఇరుదేశాలు అవగాహనకు వచ్చాయి. మిగతా అంశాలపై త్వరలో అధికారుల బృందాల స్థాయిలో మూడోవిడత చర్చలు జరగనున్నాయి.

ఇదే సందర్భంలో అంతర్జాతీయ పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ప్రాంతీయ అంశాలను చర్చకు వచ్చే అవకాశం ఉంది. 2021 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బోరిస్‌ జాన్సన్‌ రావలసి ఉన్నప్పటికీ కోవిడ్‌ ఉధృతి కారణగా పర్యటన రద్దు చేసుకున్నారు. ఆ తరువాత గత ఏడాది నవంబర్‌లో గ్లాస్గోలో జరిగిన కాప్‌ 26 సమ్మేళనం సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానం మేరకు బోరిస్‌ పర్యటనకు వస్తున్నారు. ఐరోపా యూనియన్‌నుంచి వేరుపడిన నేపథ్యంలో భారత్‌తో వాణిజ్యబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని బ్రిటన్‌ భావిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement