హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నేతల తీరు ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న… ఓడ దిగాక బోడి మల్లన్న’ చందంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కేంద్ర సర్కారుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రో, డీజిల్ ధరలు పెరుగుతాయని తాము ముందునుంచే ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని గుర్తు చేశారు. అంచనా వేసినట్లుగానే పెట్రో ధరలను బీజేపీ ప్రభుత్వం భారీగా పెంచిందని శనివారం ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో వంట గ్యాస్ సిలిండర్ సామాన్యులకు గుదిబండగా మారిందన్నారు. రాయితీని భరించాల్సిన కేంద్రం… వేలాది కోట్ల ప్రజాధనాన్ని కార్పోరేట్ కంపెనీలకు దోచిపెడుతోందని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ప్రతీసారి టీఆర్‌ఎస్ ఎండగడుతోందన్నారు. తాజాగా పెట్రో ధరల పెంపుతో బీజేపీ ప్రభుత్వం మరోసారి తన మోసపూరిత వైఖరిని చాటుకుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా… పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెబుతున్న బీజేపీ ప్రభుత్వం… ఎన్నికలు ముగిశాక ధరలు పెంచుతూ తన ప్రజావ్యతిరేక నైజాన్ని బయటపెడుతోందని విమర్శించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసేవరకు దొంగ వినయాన్ని ప్రదర్శించిన కేంద్ర ప్రభుత్వం… ఆత ర్వాత ప్రజల నడ్డి విరిచేలా ధరలు పెంచిందని మండిపడ్డారు. కరోనాతో ఆదాయ మార్గాలను కోల్పోయిన ప్రజలకు ధరల పెంపుతో కష్టాలు రెట్టింపు కానున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.