రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్మించిన 369 అడుగుల శివుడి భారీ విగ్రహాన్ని ఇవ్వాల (శనివారం) ఆవిశ్కరించారు. ఉదయ్‌పూర్‌కు 45 కి.మి దూరంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శివుడి విగ్రహంగా ఖ్యాతి పొందనుంది. తట్ పదమ్ సంస్థాన్ ఆధ్వర్యంలో శిల్పా చార్యుడు నిర్మించిన ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పాచార్యుడు మొరారి బాపు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్వానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, స్పీకర్ సీపీ జోషి హాజరయ్యారు. ఇవ్వాల్టి నుండి నవంబర్ 6వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, మత కార్యక్రమాలు నిర్వహిస్తామని సంస్థాన్ ట్రస్టీ, మీరజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పాలివాల్ తెలిపారు. ఈ రోజుల్లో శిల్పా చార్యుడు మొరారి బాపు రామకథను పారాయణం చేస్తారని తెలిపారు. శ్రీనాథ్‌జీలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం వృద్ధి చెందుతుందన్నారు.
విగ్రహం ప్రత్యేకత ఏంటంటే..
కొండ శిఖరంపై 369 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ విగ్రహాన్ని 20 కి.మి దూరం నుంచి చూడొచ్చు. ధ్యానముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని రాత్రిపూట కూడా స్పష్టంగా చూసేలా రంగురంగుల విద్యుద్దీపాలను అమర్చారు. ఈ విగ్రహం మూడంతస్తులు, ఒక హాల్, నాలుగు లిఫ్ట్‌లతో కూడి ఉంటుంది. 3వేల టన్నుల ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్, ఇసుక వాడారు. దీనిని పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది. 2012లో ముఖ్యమంత్రి గెహ్లాట్ దీనికి శంకుస్థాపన చేశారు. గంటకు 250 కి.మి వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మించిన ఈ విగ్రహం 250 ఏళ్లపాటు చెక్కుచెదరని విధంగా నిర్మించామని శిల్పాచార్యుడు మొరారి తెలిపారు.