సోమాజిగూడ, (ప్రభన్యూస్): శామీర్‌పేట మండల తహసీల్దార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారుల సహకారంతో భూ కబ్జాదారులు, కొందరు రాజకీయ నాయకులతో కలిసి భూ మాఫియాగా ఏర్పడ్డట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కుంభకోణాన్ని అమలు చేసేందుకు పథకం రచించారని బొమ్మరాస్ పేట్ రైతు సంక్షేమ సంఘం సభ్యులు ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులు మాట్లాడుతూ.. ధరణిలో లోపాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా దాదాపు 300 మంది చిన్న రైతులు సాగుచేసుకుంటున్న సుమారు 500 ఎకరాల భూమిని లక్ష్యంగా చేసుకుని అక్రమంగా వారి జీవనోపాధిని దూరం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
బొమ్మరాస్పేట్ గ్రామంలోని రైతులమైన తాము సుమారు 40-50 సంవత్సరాల క్రితం భూములను కొనుగోలు చేశామని. అప్పటి నుండి కబ్జాలో ఉన్నామని తెలిపారు. తాము ధరణిలో ఇ-పాస్‌బుక్‌లతో రికార్డులో ఉన్నామని, రైతు బంధు, రైతు భీమా వంటి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతున్నట్టు చెప్పారు. ధరణి ప్రవేశపెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా న్యాయవాదులకు అనుకూలంగా మారిందన్నారు.
దాని సాఫ్ట్‌వేర్‌లోని లోపాల కారణంగా అనధికారిక, సంబంధం లేని వ్యక్తులు ఇతరులకు చెందిన భూముల కోసం మ్యుటేషన్లు, పాస్‌బుక్‌లు జారీ చేస్తున్నారని, వాటి కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి అనుమతించడం ల్యాండ్ మాఫియాకు అనుకూలంగా మారిందని ఆరోపించారు. దుగ్గిరాల కుటుంబానికి చెందిన వారసులు, భూ కబ్జాదారులు, రాజకీయ నాయకులు, కొందరు అవినీతిపరులైన రెవెన్యూ అధికారులతో తమ భూములను లాక్కోవడానికి యత్నిస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు.