Thursday, November 21, 2024

అమెరికా చరిత్రలొనే అతిపెద్ద విపత్తు..

అమెరికా దేశ చరిత్రలో అతి పెద్ద విపత్తుల్లో టోర్నడో కూడా ఒకటని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. కెంటకీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. టోర్నడో ప్రభావిత ప్రాంతాలను ప్రభుతం ఆదుకుంటుందని, ఆయా ప్రాంతాల్లో తాను స్వ‌యంగా పర్యటిస్తానని బైడెన్‌ వెల్లడించారు. గత రెండు రోజులుగా ఆరు రాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.. వందలాది మంది గల్లంతైనట్టు సమాచారం. మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్‌, టెన్నెసీలోని వివిధ ప్రాంతాల్లోనూ టోర్నడోలు బీభత్సం సృష్టించి ఆస్తి, ప్రాణ నష్టాలను కలిగించాయి. అమెరికా చరిత్రలో 1925 తరువాత అత్యంత తీవ్రమైన టోర్నడో ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో మిస్సౌరీలోని సుడిగాలుల ధాటికి 915 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

కెంటకీపై టోర్నడో విరుచుకుపడినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మేఫీల్డ్‌ పట్టణం నేలమట్టమైందని, అక్కడి చారిత్రాత్మక భవనాలు, కార్యాలయాలు కుప్పకూలాయని వివరించాయి. టోర్నడో సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక్క కెంటకీలోనే 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మృతుల్లో అత్యధికంగా మెఫీల్డ్‌ క్యాండిల్‌ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులని, టోర్నడో విరుచుకుపడిన సమయంలో ఫ్యాక్టరీలో 110 మంది ఉన్నట్టు యాజమాన్యం తెలిపింది. 40 మందిని కాపాడినట్టు వివరించింది. అలాగే ఇల్లినోయిలోని అమెజాన్‌ గోదాంలో గోడకూలి ఆరుగురు చనిపోయారు. ప్రమాద సమయంలో గోదాంలో వంద మందికిపైగా కార్మికులు ఉన్నారు. వారంతా క్రిస్మస్‌ సందర్భంగా వచ్చిన ఆర్డర్స్‌ను ప్యాక్‌ చేస్తున్నారని అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement