ఖమ్మం, ఆంధ్రప్రభ : వయసులో చిన్న వాళ్లమైనా తమకు పెద్ద మనసు ఉందని నిరూపించారు కొందరు విద్యార్థులు. ఖమ్మంలోని జీఆర్‌ఆర్ శ్రీనివాసం సొసైటీలో నివాసముంటున్న చిన్నారులు, కడుపు నిండా తిండి లేక ఇబ్బంది పడుతున్న అనాథల కోసం తమ వంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. రిషిత శ్రీశ్లోక (5వ తరగతి ), చిన్మయి(5వ తరగతి), తన్మయిశ్రీ (6వ తరగతి), సిరి గాయత్రి (6వ తరగతి), జశ్వంత్ (6వ తరగతి), మోక్షిత్ (7వ తరగతి) ఓరోజు ఆడుకుంటూ తమలో తామే మాట్లాడుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారి కోసం ఏదైనా సాయం చేద్దామనుకున్నారు. తమ సొసైటీలో నివాసముంటున్న ప్రతి ఇంటికి వెళ్లి తమ ఆలోచనను వారితో పంచుకున్నారు.
వారికి తోచినంత డబ్బు ఇవ్వమని కోరారు. పది రూపాయల నుంచి మొదలుపెట్టి వంద రూపాయల వరకు ఒకొక్కరు తమకు తోచినంత డబ్బులు ఇచ్చారు. అలా వచ్చిన సొమ్ముతో పిల్ల గ్యాంగ్ ఆదివారం బియ్యం, నిత్యావసర వస్తువులు కొని అనాథలను అక్కున చేర్చుకుంటున్న అన్నం ఫౌండేషన్‌కు అందజేశారు. తాము ఇచ్చిన వస్తువులతో అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి భోజనం ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఇంత చిన్నవయసులోనే సేవ చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చిన విద్యార్థులను జీఆర్‌ఆర్ సొసైటీ నివాసులతో పాటు, అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.