ఉక్రెయిన్ దుందుడుకు చర్యలు, తమ భూభాగంపై దాడులు ఆపకపోతే రాజధాని కీవ్‌పై క్షిపణి దాడులు తీవ్రతరం చేస్తామని రష్యా శుక్రవారం హెచ్చరించింది. అన్నట్టుగానే తెల్లవారుఝామునే కీవ్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. కొద్దిరోజులు క్రితం కీవ్ నుంచి దళాలను ఉపసంహరించిన రష్యా ఎదురుదెబ్బల నేపథ్యంలో మళ్లి దాడులు మొదలుపెట్టింది. సరిహద్దుల్లోని రష్యా భూభాగంలోని కొన్ని గ్రామాలపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడుతోందని ఆరోపించిన రష్యా, నల్ల సముద్రంలో మోహరించిన తమ యుద్ధనౌక మాస్క్వా మునిగిపోయిన నేపథ్యంలో రగిలిపోతోంది. ఉక్రెయిన్ శక్తివంతమైన నెప్య్టూన్ క్షిపణులతో దాడి చేయడంవల్లే మంటల్లో చిక్కుకుని ఆ యుద్ధనౌక సముద్రంలో మునిగిపోయిందన్న వార్తల నేపథ్యంలో రష్యా దాడులు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే శుక్రవారం తాజా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు మాస్క్వా దుర్ఘటన నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టేనని పేర్కొంటూ రష్యా టెలివిజన్ చానెళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి.
క్షిపణి దాడులతో కీవ్‌లో విధ్వంసం..
ఉక్రెయిన్ రాజధాని కీవ్ శివారులోని సైన్యానికి చెందిన ఆయుధాల ఫ్యాక్టరీని దూరశ్రేణి రకం క్షిపణి కాలిబర్‌ను ప్రయోగించి ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. తమ దాడిలో విజార్‌గా పిలిచే ఝులిన్‌స్కీ ఆయుధాల తయారీ కర్మాగారం ధ్వంసమైందని పేర్కొంది. ఇక్కడ దూర, మధ్య శ్రేణి క్షిపణులు, మరమ్మతులు, యాంటీ షిప్ మిసైళ్లను తయారు చేస్తారని ప్రకటించింది. తమ భూభాగం పరిథిలోని క్లిమోవో గ్రామంపై గురువారంనాడు ఉక్రెయిన్ దళాలు మి-8 హెలికాప్టర్‌తో దాడులు చేశాయని, తమ ఎస్-400 క్షిపణి వ్యవస్థను నాశనం చేసిందని రష్యా ఆరోపించింది. అలాగే బ్రియాన్‌స్క్ ప్రాంతంలోని గ్రామాలపైనా హెలికాప్టర్లతో దాడులకు పాల్పడుతోందని, ఆ దాడుల్లో ఎనిమిది మంది రష్యన్ పౌరులు గాయపడ్డారని పేర్కొంది. ఉక్రెయిన్ వైఖరికి ప్రతిగా తాము కీవ్‌పై క్షిపణి దాడులు చేశామని, మునుముందు వారి వైఖరి మారకపోతే ఉధృతం చేస్తామని శుక్రవారం రష్యా బలగాలు ప్రకటించాయి. మరోవైపు ఖార్కీవ్‌కు సమీపంలోని లియుమ్‌సోక్‌పై రాకెట్లతో దాడులు చేశామని, ఈ దాడుల్లో పోలెండ్‌కు చెందిన 30మంది ప్రైవేటు దళంలోని సైనికులు మరణించారని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..