హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలోని పేరున్న మంచి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేయాలనుకునేవారికి ఇక ఫీజుల మోత మోగనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజులు భారం కానున్నాయి. 2022-25 వరకు పెరిగే ఫీజులే అమలు కానున్నాయి. అయితే ఈ నెల 26న జరిగే రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ర్‌సీ) భేటీలో ఫీజులపై మండలి తుది నిర్ణయం తీసుకోనున్న తర్వాత ఫీజుల పెంపు సిఫారసులను ప్రభుత్వానికి పంపనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఆమోదించి నిర్ణయం తీసుకున్నాక కొత్త ఫీజులు అమలులోకి వస్తాయి. వృత్తి విద్యా కోర్సుల ఫీజులను మూడేళ్లకోసారి సమీక్షిస్తారు. కళాశాల ఆదాయ, వ్యయాలు, మౌలిక వసతులు, ఫ్యాకల్టి ఇతర వాటికి అయ్యే ఖర్చును బట్టి ఫీజులను నిర్ణయిస్తారు. 2019లో నిర్ణయించిన ఫీజు గడువ ఈ ఏడాదితో ముగియడంతో వచ్చే 2022-25 మూడేళ్లకు కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఇంజనీరింగ్ కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్‌సీ ఈనెల 20 వరకు భేటీ అయి వారి అభిప్రాయాలను విని ఇంజనీరింగ్ ఫీజులను ఖరారు చేసింది. ఈక్రమంలోనే కనీస ఫీజును రూ.45 వేలుగా, గరిష్ట ఫీజును 1.73 లక్షలుగా టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసింది. ప్రస్తుతం రూ.35వేలుగా ఉన్న కనీస ఫీజును ఈ విద్యాసంవత్సరం నుంచి రూ.45వేలుగా, రూ.1.34లక్షలుగా ఉన్న గరిష్ట ఫీజును 1.73 లక్షలుగా ఖరారు చేసింది. అయితే ఈ ఫీజులను కాలేజీల వారీగా ఖరారు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.
30 కాలేజీల్లో లక్షకు పైనే ఫీజు….
రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. సీబీఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ ఫీజు గరిష్టంగా రూ.1.73 లక్షలుగా ఉంటే, ఎంజీఐటీలో మాత్రం గరిష్టంగా రూ.1.60 లక్షలుగా ఫీజును టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసింది. మరో 20 నుంచి 30 కాలేజీల్లో లక్షకు పైగానే ఇంజీనిరింగ్ ఫీజు ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. సీబీఐటీ కాలేజీలు తమ ఫీజును రూ.3 లక్షలకు పైగా నిర్ణయించాలని ప్రతిపాదించగా, ఎంజీఐటీ కాలేజీ యాజమాన్యం రూ.2 లక్షలకు పైగా ఉండాలని కోరినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే రెండు మైనారిటీ కాలేజీలు మాత్రం తమ కనీస ఫీజును రూ.35 వేలుగానే ఉంచాలని టీఏఎఫ్‌ఆర్‌సీని కోరినట్లు తెలిసింది. ఫీజులు భారీగా పెంచితే విద్యార్థులు చేరరని అధికారులతో చెప్పినట్లు తెలిసింది. మిగతా కాలేజీలు మాత్రం తమ ఫీజును పెంచాలని కోరడంతో కనిష్టంగా రూ.45 వేల నుంచి గరిష్టంగా రూ.1.73 లక్షల వరకు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
విద్యార్థులపై భారమే…
మంచి కాలేజీల్లో బీటెక్ చేయాలనుకునే వారికి ఇంజీనీరింగ్ విద్యా ఇక భారం కానుంది. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌కు గానూ సాధారణ కాలేజీల్లో చదవాలనుకునే వారు ఈఏడాది నుంచి రూ.45 వేలు చెల్లించాల్సి ఉండగా, సీబీఐటీ లాంటి టాప్ కాలేజీల్లో చేరాలనుకునేవారు మాత్రం 1.73 లక్షలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే కనీష్ట ఫీజు కింద చేరే విద్యార్థులు గత ఫీజుతో పోల్చుకుంటే నాలుగేళ్లకు రూ.40వేలు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. టాప్ కాలేజీల్లో చేరే విద్యార్థులు దాదాపు రూ.1 లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులకు భారం కానుంది.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రస్తుతం అమలవుతోంది. అలాగే ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకు వచ్చినా రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. ఆపైన ర్యాంకు ఉంటే బీసీ, ఓసీలు ఎవరికైనా కాలేజీ ఫీజు ఎంత ఉన్నా ప్రస్తుత ఫీజు రూ.35 వేలు మాత్రమే ఫీరీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. మిగతావి కట్టుకోవాల్సి ఉంటుంది. ఈనెల 26న జరిగే టీఏఎఫ్‌ఆర్‌సీ భేటీలో ఖరారు చేసిన ఫీజులను ఆమోదించించిన తర్వాత ఆ నివేధికను ప్రభుత్వానికి పంపనున్నారు. దానిపై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
పెరగనున్న ఫార్మసీ, ఎంబీఏ ఫీజులు?…
ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, అర్కిటెక్చర్ కోర్సుల ఫీజులు సైతం ఈఏడాది పెరగనున్నాయి. ఆగస్టు 1 నుంచి ఫీజుల పెంపు అంశంపై టీఏఎఫ్‌ఆర్‌సీ దృష్టి కాలేజీలతో సంప్రదింపులు జరపనుంది. ఫార్మసీ కళాశాల ఫీజుల పెంపుపై విచారణను ఆగస్టు 1, 2, 3 తేదీల్లో చేపట్టనుంది. ఎంబీఏ, ఎంసీఏ కళాశాల ఫీజుల పెంపుపై ఆగస్టు 10 నుండి 12 తేదీల్లో సంప్రదింపులు జరుపనుంది. అలాగే ఆర్కిటెక్చర్ కాలేజీలతో ఆగస్టు 3న సంప్రదింపులు జరపనుంది. అయితే కాలేజీల అభిప్రాయాలను తీసుకొని కోర్సు ఫీజును పెంచాలా? వద్దా? అనేదానిపై తుది నిర్ణయాన్ని టీఏఎఫ్‌ఆర్‌సీ తీసుకుంటుంది. అయితే ఒక్కో రోజు 40 నుంచి 50కు పైగా కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్‌సీ సంప్రదింపులు జరుపడంపైన అధ్యాపక సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.