Friday, November 22, 2024

Delhi | నిలిచిన అమర్‌నాథ్ యాత్ర.. ప్రతికూల వాతావరణమే కారణం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అమర్‌నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భారీగా వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. హిమాలయాల్లో ఓ ఎత్తైనగుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకోవడం ప్రతి ఏటా జరిగే అమర్‌నాథ్ యాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతుంటారు. అయితే అత్యంత క్లిష్టమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితుల మధ్య సాగే ఈ యాత్ర కోసం అధికార యంత్రాంగం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. అమర్‌నాథ్ మంచు లింగాన్ని చేరుకోడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపేసినట్టు అధికారులు ప్రకటించారు.

దీంతో యాత్రికులు బాల్తాల్ బేస్‌క్యాంప్, పహల్‌గాం బేస్‌క్యాంప్ వద్ద నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎత్తైన వాతావరణంలో తక్కువ మోతాదులో ఉండే ఆక్సీజన్ కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను యాత్రికులు సమర్పించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి ప్రకృతి ఊహకందని రీతిలో విరుచుకుపడి విలయాన్ని సృష్టిస్తూ ఉంటుంది. గత ఏడాది అమర్‌నాథ్ గుహ ఎదురుగా ఒక్కసారిగా మెరుపు వరద దూసుకొచ్చి అనేక మంది ప్రాణాలు బలితీసుకుంది.

క్షణాల వ్యవధిలో వాతావరణం మారిపోతూ అడుగడుగునా సవాళ్లు విసురుతూ ఉంటుంది. క్లౌడ్ బరస్ట్ వంటి ఘటనల కారణంగా మెరుపు వరదలు సంభవిస్తూ ఉంటాయి. వర్షాలకు మట్టి కరిగి కొండచరియలు విరిగిపడుతుంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న అధికార యంత్రాంగం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రహించింది. ఆ మేరకు వర్షాలు తగ్గి, వాతావరణం అనుకూలంగా మారే వరకు యాత్రను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్రను పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 80 వేల మందికి పైగా అమర్‌నాథ్‌ను దర్శించుకున్నట్టు వెల్లడించారు.

- Advertisement -

వాతావరణ శాఖ హెచ్చరికలు

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో జమ్ము-కాశ్మీర్ రాష్ట్రమంతటా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే అమర్‌నాథ్ యాత్ర నిలిచిపోగా.. జమ్ము-శ్రీనగర్ రహదారి సహా పలు మార్గాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. రానున్న 24 గంటల్లో దేశంలో ఒకట్రెండు రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని చమోలిలో పర్వతాల నుండి రాళ్లు పడడంతో బద్రీనాథ్ హైవే పై రాకపోకలు నిలిచిపోయాయి. పది రోజుల వ్యవధిలో ఈ రహదారి నాలుగు సార్లు మూతపడింది. ఉత్తరాఖండ్‌లోని పిత్తోరాగఢ్ జిల్లాలోని ధార్చులలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక వంతెన కొట్టుకుపోయింది.

ఇక్కడ చాల్ గ్రామంలో 200 మంది చిక్కుకుపోగా, వారిని రక్షించేందుకు వెళ్లిన రాష్ట్ర విపత్తు సహాయ బృందం కూడా చిక్కుకుపోయిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం హిమాలయ రాష్ట్రాల్లోనే కాదు, కేరళలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కన్నూర్, కాసర్‌గోడ్‌లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలప్పుజాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెయ్యి మందికి పైగా ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు.

రానున్న 24 గంటల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తెలంగాణ, జమ్ము కాశ్మీర్‌లో మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు లేదా ఓ మోస్తరు వర్షం కురుస్తుందని వెల్లడించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, మహారాష్ట్రలోని మరాఠ్‌వాడా, పశ్చిమ బెంగాల్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement