Monday, December 9, 2024

TG | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్

డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను విక్రయించడానికి రాష్ట్ర‌ ప్రభుత్వం మహిళా శక్తి బజార్లను ఏర్పాటు చేసింది. నగరం నడిబొడ్డులోని శిల్పారామంలోని 3.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ను గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇతర నాయకులు, అధికారులు హాజరైయ్యారు.

మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయా సంఘాల పనితీరును తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పాన్ని అభినందించారు.

మహిళా సాధికారత కోసం తెలంగాణలో మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొనియాడారు. ఈ స్వయం సహాయక మహిళ సంఘాలు ఎంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్నారని భవిష్యత్తులో మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -

ఆడబిడ్డలు అదానీ, అంబానీలతో పోటీ పడాలని…

సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గవర్నర్ జిష్ణదేశ్ శర్మకు కృతజ్ఞతలు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. సోలార్ పవర్ ప్రాజెక్టులలో ఆడబిడ్డలు అదానీ, అంబానీలతో పోటీ పడాలని ప్రభుత్వం నిర్దిష్ట కార్యక్రమంలో ముందుకు వెళుతోందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇది నెరవేరాలంటే స్వయం సహాయక సభ్యుల సంఖ్య 65 లక్షల నుంచి కోటి మందికి చేరాలని ఆయన చెప్పారు. స్వయం సహాయక సంఘాల్లో కోటి మందిని చేర్పించే బాధ్యత మీది. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ప్రభుత్వానిది అని మహిళా సంఘాలను ఉద్దేశించి అన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500 లకే సిలిండర్ వంటి మహిళా సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరించిన సీఎం.. కోటి మందిని కోటీశ్వరులను చేసే లక్ష్య సాధనలో భాగంగా త్వరలోనే ఉమ్మడి జిల్లాల వారిగా సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల 9 న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని ఈ సందర్బంగా మహిళా సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement