న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రఖ్యాత విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల విశిష్టతను ప్రపంచానికి తెలియజెప్పేందుకు తగిన చర్యలు చేపట్టాలని, ఆయన 550వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన రాజ్యసభలో తెలుగులో ప్రసంగించారు. శ్రీకృష్ణదేవరాయల పేరు, ఆయన గొప్పదనం తెలియని భారతీయులెవ్వరూ ఉండరన్నారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా 1509 నుంచి 1529 వరకు ఆయన పాలించిన 20 ఏళ్లను స్వర్ణ యుగంగా పేర్కొంటారని జీవీఎల్ చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం, ప్రతిఒక్కరూ ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నేటికీ తెలుగు క్లాసికల్ భాషగా నిలబడడం వెనుక రాయలు చేసిన కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. అముక్త మాల్యద వంటి గొప్ప కావ్యాలు రచించిన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచడానికి అనేక మంది కవులను ప్రోత్సహించారని జీవీఎల్ నరసింరావు తెలిపారు.
తెలుగు భాషతో పాటు హిందూ, వైదిక ధర్మం కోసం తిరుమల తిరుపతి దేవస్థానికికే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని వందలాది దేవాలయాలకు విరాళాలిచ్చి హిందూ ధర్మం నేటికీ పటిష్టంగా నిలబడేలా చేసిన మహనీయుడు ఆయనని కొనియాడారు. శ్రీకృష్ణరాయలు జన్మించి ( 1471వ సంవత్సరం ) నేటికి 550 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విశిష్ట కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. మ్యూజియం, ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ప్రపంచ దేశాలకు ఆయన గురించి తెలిసేలా సినిమాలు, సీరియళ్లు నిర్మించాలని, పుస్తకాలు ముద్రించాలని జీవీఎల్‌ఎన్ సూచించారు. తెలుగు భాషకు, తెలుగు నాడుకు చేసిన సేవలను, దక్షిణాది రాష్ట్రాల్లో హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ మహాచక్రవర్తి చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించాలని ఆయన వినతి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..