ప్రఖ్యాత టెక్ కంపెనీ గూగుల్ ఇటీవలే 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్ధిక మాంద్యం భయాలు, తగ్గుతున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ ప్రకటించింది. తాజాగా దీనిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. దీనిపై ఆయన ఉద్యోగులతో మాట్లాడారు. కంపెనీ వృద్ధి నెమ్మదించడం వల్లే ఉద్యోగుల తొలగింపు విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయంలో స్పష్టమైన, ఖచ్చితమైన ముందస్తుగా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే పరిస్థితి మరింత విషమించి దారుణంగా మారి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులతో ఆయన సోమవారం నాడు అంతర్గత సమావేశంలో పాల్గొన్నారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.
ఉద్యోగుల తొలగింపుతోనే ఈ ప్రక్రియ ఆగిపోదని కూడా పిచాయ్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. బోనస్‌లు కంపెనీ వృద్ధికి అనుసంధానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యతాయుత నాయకత్వ స్థానాల్లో ఉన్న అందరికీ ఈ సంవత్సరం బోనస్‌లు తగ్గుతాయని చెప్పారు. సుదీర్ఘకాలం కంపెనీలో పని చేసి, తాజాగా ఉద్యోగం కోల్పోయిన వారికి పరిహార ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ ఉన్నతోద్యోగి ఒకరు వెల్లడించారు.
ప్రాధాన్య అంశాల్లో పెట్టబుడలను కొనసాగించి, కంపెనీ భవిష్యత్‌ను పరిరక్షించడంలో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రుత్ పోరట్ చెప్పారు. ఈ విషయంలో వీలైనంత త్వరగా,
స్పష్టంగా వ్యవహరిస్తేనే దీర్ఘకాల పెట్టుబడులు పెట్టే సామర్ధ్యం ఏర్పడుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. గూగుల్‌లో అంతర్జాతీయంగా పని చేస్తున్న 12000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గత శుక్రవారం నాడు కంపెనీ ప్రకటించింది. కొవిడ్ పరిణామాల సమయంలో అవసరాలకు అణుగుణంగా నియామకాలు చేపట్టామని, ప్రస్తుత పరిస్థితులకు మూలంగా తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ ప్రకటించింది. పూర్తిస్థాయి సమీక్ష తరువాతే ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ఆల్ఫాబెట్ ఉత్పత్తుల విభాగాలు, కార్యకలాపాలు, స్థాయిలు, ప్రాంతాల వారీగా ఉద్యోగాల కోత ఉంటుందని తెలిపింది.
అసాధారణ నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కూ వీడ్కోలు చెప్పాల్సి వస్తోందని తెలిపింది. దీనిపై తాను క్షమాపణలు చెబుతున్నానని సుందర్ పిచాయ్ ఉద్యోగులకు పంపించిన ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వారి జీవితాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందనే విషయం తనకు ఆందోళన కలిగిస్తోందని సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్ భారీగా ఉద్యోగులను తొలగించాలన్న నిర్ణయాన్ని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ గట్టిగానే వ్యతిరేకిస్తోంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం దాని పనితీరుపై ప్రభావం చూపిస్తుందని యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది.