న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై చేసిన వ్యాఖ్యల్లో అసభ్యకరమైన భాష ఏమీ లేదని, అయినప్పటికీ తప్పుగా అర్థం చేసుకుంటే క్షమాపణ కోరుతున్నానని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం జాతీయ మహిళా కమిషన్‌కు తెలిపారు. గవర్నర్‌కు సైతం రాతపూర్వకంగా క్షమాపణ కోరుతూ లేఖ రాస్తానని, ఆ లేఖ కాపీని జాతీయ మహిళా కమిషన్‌కు కూడా అందజేస్తానని వెల్లడించారు. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. కమిషన్ నోటీసులు అందుకున్న కౌశిక్ రెడ్డి మంగళవారం ఉదయం గం. 11.30 సమయంలో విచారణకు హాజరయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు విచారణ జరిగింది. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు.
జనవరి 25న తెలంగాణ రాష్ట్రంలోని జమ్మికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. మహిళా గవర్నర్‌పై ఓ ప్రజా ప్రతినిధి అసభ్య పదజాలాన్ని ఉపయోగించడాన్ని తప్పుబడుతూ జాతీయ మహిళా కమిషన్ ఫిబ్రవరి 14న నోటీసులు జారీ చేసింది. కౌశిక్ రెడ్డి స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆ మేరకు కౌశిక్ రెడ్డి మంగళవారం ఓ న్యాయవాదితో పాటు విచారణకు హాజరయ్యారు. అప్పటికే సిద్ధం చేసుకున్న రాతపూర్వక వివరణను కూడా కమిషన్‌కు అందజేశారు. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ స్వయంగా ఈ విచారణ జరిపారు.
తప్పుగా అర్థం చేసుకున్నారు
గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే క్రమంలో కౌశిక్ రెడ్డి ఆ పదం ఉపయోగించిన సందర్భాన్ని, తెలుగు మాండలికాల్లో వ్యత్యాసాన్ని వివరించినట్టు తెలిసింది. రాతపూర్వక వివణలో సైతం తెలుగు భాష, తెలంగాణ మాండలికం గురించి చెబుతూ కొన్ని సామెతలు, వ్యవహారిక భాషలో తరచుగా ఉపయోగించే పదాలను ఉదహరించినట్టు సమాచారం. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అసభ్యత లేదని, దురుద్దేశం అసలే లేదని చెప్పినట్టు తెలిసింది. తెలుగులో అలాంటి పదాలు సమాజంలో ప్రజలు నిత్యం ఉపయోగించే పదాలేనని, దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే ఈ వివాదం తలెత్తిందని కౌశిక్ రెడ్డి చెప్పినట్టుగా తెలిసింది.
హైదరాబాద్‌లో మాట్లాడతా: కౌశిక్ రెడ్డి
జాతీయ మహిళా కమిషన్ విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను అన్ని వివరాలు హైదరాబాద్ చేరుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహించి వెల్లడిస్తానని అన్నారు. తనకు కమిషన్ నుంచి నోటీసులు వచ్చినందున విచారణకు స్వయంగా హాజరయ్యానని తెలిపారు. కమిషన్‌కు వివరణ ఇచ్చానని, చెప్పాల్సింది చెప్పానని అన్నారు. అంతకు మించి మాట్లాడడానికి కౌశిక్ రెడ్డి ఇష్టపడలేదు.