ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరలేదని టీమిండియా మహిళల మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. మరో ప్రపంచకప్ ఆడే పరిస్థితి లేకపోవడంతోనే సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలకానని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీ పేర్కొంది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో ఎన్నో రికార్డులు, మరెన్నో ఘనతలను అందుకున్న మిథాలీ రాజ్ మహిళల క్రికెట్‌పై ఆదరణ పెరగడంలో కీలక పాత్ర పోషించింది. ‘ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేం కాదు. చాలా ముందే అనుకున్నా. వరల్డ్ కప్ టోర్నీలో నిరాశ ఎదురైంది. దాని నుంచి బయటపడేందుకు కాస్త సమయం పట్టింది. ప్రపంచకప్ సాధించాలని కలగన్నా. ఇంకో వరల్డ్ కప్ టోర్నీ ఆడే పరిస్థితి లేదు.
అలాంటప్పుడు క్రికెట్లో కొనసాగడంలో అర్థం లేదు. అందుకే ఇంకొంతకాలం ఆడే సత్తా ఉన్నప్పటికీ వీడ్కోలు పలికా” అని మిథాలీ రాజ్ వివరించారు. ”కెరీర్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. మహిళల క్రికెట్లో ఎన్నో మార్పులను ప్రత్యక్షంగా చూశా. ఎన్నో మధుర విజయాలనూ అందుకున్నా. నీలి జెర్సీ వేసుకుని మైదానంలో బరిలో దిగితే లభించే అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేశం కోసం ఇన్నేళ్లు ఆడినందుకు ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. సరైన ప్రణాళికతో ముందుకెళ్తే ఐదేళ్లలో భారత్‌ను నం.1 జట్టుగా చూడొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.