న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఒడిశా రైలు ప్రమాదంలోనే కాదు, ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ విమర్శించారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతి చెందినవారిలో జనరల్ బోగీలలో ఉన్న పేదలు, కూలీలు, వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. దేశంలో వలస కార్మికులు లేకపోతే జీడీపీ వృద్ధిరేటు లేదని, దేశాభివృద్ధి కూడా ఉండదని గుర్తుచేశారు.
అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కష్టజీవులు మరణిస్తే కేంద్రం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్మికుల శ్రమ ద్వారా వస్తున్న సంపద మీద ఉన్న ప్రేమ, కార్మికులను ఆదుకోవడం మీద లేదని అన్నారు. అమెరికా, చైనా రైల్వేల తర్వాత ప్రపంచంలో అత్యంత పెద్ద రైల్వే వ్యవస్థ భారతదేశంలో ఉందని, 13 వేలకు పైగా రైళ్లు దేశంలో ప్రయాణిస్తున్నాయని తెలిపారు. సాధారణ ప్రజలు ఎక్కే రైళ్లను కుదిస్తూ సంపన్నులకు అనుకూలమైన రైళ్లను కేంద్రం ప్రారంభిస్తోందని చెప్పారు.
రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. 10 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బి. వెంకట్ డిమాండ్ చేశారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య పెంచాలని, కరోనా అనంతరం రద్దు చేసిన సాధారణ ప్రజలు ఎక్కే పాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాలపై రైల్వే బోర్డు అధికారులను వ్యవసాయ కార్మిక సంఘాల బృందం కలిసి చర్చిస్తామని చెప్పారు.
ఏపీలో పాలక ప్రతిపక్షాలు స్పందించకపోవడం సిగ్గుచేటు
గత 50 రోజులుగా మల్లయోధులు (రెజ్లర్లు) చేస్తున్న ఆందోళనను విస్మరించి కేంద్ర ప్రభుత్వం దోషులకు అండగా నిలిచిందని బి. వెంకట్ ఆరోపించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం అమానుషమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమకు అన్యాయం జరిగిందంటూ సిగ్గు విడిచి బహిరంగంగా ఉద్యమిస్తున్నటువంటి మహిళా రెజ్లర్ల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి సానుభూతి ప్రదర్శించాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వారి ఆందోళనను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అధికార పార్టీ ఎంపీగా ఉన్న ఉన్న బ్రిజ్‌భూషణ్ అనేక నేరాలకు, లైంగిక వేధింపులకు, మైనర్లపై వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉన్నప్పటికీ అరెస్టు చేయకపోవడం అంటే కేంద్ర ప్రభుత్వం దోషికి కొమ్ముగాయడం కాక మరేంటని మండిపడ్డారు.
ప్రపంచ దేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై చిన్న ఆరోపణ వచ్చినా విచారణలు, అరెస్టులు జరుగుతున్నాయని, కానీ దోషులకు అండగా ప్రభుత్వమే నిలబడ్డం మరెక్కడా లేదని అన్నారు. రెజ్లర్ల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వకపోవడం, పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వంటి అనేక విషయాల్లో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్రానికి ఏపీలో పాలక, ప్రతిపక్ష పార్టీలు లొంగిపోయాయని ధ్వజమెత్తారు. దేశమంతా రెజ్లర్ల విషయంలో మోడీ ప్రభుత్వాన్ని తప్పు పడుతుంటే ఈ రెండు పార్టీలు ఏమాత్రం ఖండించకపోవడం చూస్తుంటే బీజేపీకి ఎంతగా లొంగిపోయాయో అర్థమవుతోందని అన్నారు.
మద్దతు ధర స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా లేదు
కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు ప్రకటించిన మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా లేదని వ్యవసాయ కార్మిక సంఘం నేత బి. వెంకట్ ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని ప్రైవేటికరించేలా మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు, కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యవసాయ కార్మిక సంఘం క్విట్ ఇండియా డే సందర్భంగా దేశవ్యాప్త ప్రచార ఉద్యమం చేపడుతుందని ప్రకటించారు.