అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
”ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయం. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదు. విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్నీ మంచి రోజులే. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు” అని చంద్రబాబు అన్నారు.
రామ్మోహన్ నాయుడు హర్షం
కేంద్ర ప్యాకేజీపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధి కోసం రూ.11,440 కోట్లు కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. నష్టాలను అధిగమించేందుకు, ప్లాంట్ లాభాల బాట పట్టేందుకు కేంద్ర ప్యాకేజీ దోహద పడుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.