థాయ్‌లాండ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా స్రెట్టా థావిసిన్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కొత్త ప్రధానమంత్రి నియామకం వరకు ఆపద్ధర్మ పద్ధతిలో ప్రస్తుత కేబినెట్ మాత్రం కొనసాగుతుందని ధర్మాసనం వెల్లడించింది. దీనికి ఎలాంటి కాలపరిమితిని విధించలేదు.
గతంలో జైలు శిక్ష అనుభవించిన న్యాయవాదిని మంత్రివర్గంలో నియమించటంతో థావిసిన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కోర్టు న్యాయమూర్తి పుణ్య ఉద్చాచోన్ అన్నారు. విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు థావిసిన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. మరోవైపు.. తక్షణమే తమ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.
గత ఏప్రిల్‌లో జరిగిన దేశ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పిచిత్ చుయెన్‌బాన్‌ను ప్రధాని కార్యాలయ మంత్రిగా థావిసిన్ నియమించారు. అయితే ఆయన 2008లో మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రాకు సంబంధించిన న్యాయమూర్తికి లంచం ఇచ్చిన కేసులో కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొని ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు. పిచిత్ గతం గురించి తెలిసినప్పటికీ ఆయన్ను కేబినెట్‌లోకి ప్రధాని తీసుకున్నారని.. ఇది నైతిక ఉల్లంఘనలకు పాల్పడటమేనని న్యాయస్థానం పేర్కొంది.