బ్యాంకాక్: థైలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పురుషుల జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు విజేతగా నిలిచారు. ఆదివారం బ్యాంకాక్ వేదికగా జరిగిన మెన్స్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సాత్విక్-చిరాగ్ ద్వయం 21-15, 21-15 తేడాతో చైెనాకు చెందిన చెన్ బొ యాంగ్-లియు యిపై జంటను వరుస సెట్లలో చిత్తు చేసి థైలాండ్ ఓపెన్ టైటిల్‌ని కైవసం చేసుకున్నారు.
దాంతో పాటు 9వ వరల్డ్ టూర్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్లుగా బరిలోకి దిగిన సాత్విక్-చిరాగ్ జోడీ.. ఆఖర్లో విజేతగా నిలిచి మళ్లి వరల్డ్ నెం.1 ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. అలాగే వీరికి ఇది రెండో థైలాండ్ ఓపెన్ టైటిల్. 2019లో తొలిసారి థైయ్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచారు.
అలాగే వీరిద్దరూ ఈ ఏడాది అద్భుత ఫామ్‌ను ప్రదర్శిస్తూ రెండో సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకున్నారు. అంతకుముందు మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అలాగే మలేషియా ఓపెన్ సూపర్ 1000, ఇండియా ఓపెన్ 750 టోర్నీల్లో రన్నరప్‌లుగా నిలిచారు.
ఓవరాల్‌గా ఈ సంవత్సరం దూకుడుగా ఆడుతూ మంచి ఫలితాలు రాబట్టుతున్నారు. ఇక త్వరలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన పారిస్ ఒలింపిక్స్‌కి ముందు థైలాండ్ టైటిల్ నెగ్గడం వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహంలేదు.