తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్. డిజిటల్ చెల్లింపులతో బస్ టికెట్లు ఇచ్చేలా ఆర్టీసీ గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గూగుల్ పే, ఫోన్ పేతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా టికెట్లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
అయితే తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ముందుగా హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఈ డిజిటల్ చెల్లింపులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఐటిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్)లో లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. ప్రయాణికులు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్‌కార్డులతో పాటు ఇతర డిజిటల్ చెల్లింపుల ద్వారా టికెట్లు పొందవచ్చు. ఇప్పటికే బండ్లగూడ డిపో పరిధిలో ఆర్టీసీ అధికారులు ఐటిమ్స్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
ఐటిమ్స్ వినియోగంపై కండక్టర్లకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటూ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయనే విషయాన్ని అధికారులు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్-పఠాన్‌చెరు (218) మార్గంలో ఐటిమ్స్‌తో డిజిటల్ పేమంట్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.