తెలంగాణ ఆర్టీసీ భక్తులకు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. 175 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ లోని 24 ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపనున్నారు.
కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, మెహిదీపట్నం, దిల్ షుక్‌నగర్, కూకట్‌పల్లి, పటాన్ చెరు, ఈసీఐఎల్, పాత బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా జులై 21, 22 తేదీలలో ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్ అమ్మవారి బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.