Tuesday, November 26, 2024

TG | అంగన్వాడి చిన్నారులకు త్వరలో యూనిఫాంలు : మంత్రి సీతక్క

సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి దానసరి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, అందిస్తున్న సేవలపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ‘అమ్మ మాట- అంగన్ వాడీ బాట’ పేరుతో వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆమె సూచించారు.

తొలి ఒడి అమ్మ అయితే.. మలి ఒడి అంగన్‌వాడీ కేంద్రాలే అని మంత్రి అన్నారు. చిన్నారులకు ఆరోగ్యం, పోషకాహారం, భద్రత కల్పించడమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేయాలి అని అన్నారు. పిల్లల భద్రత మన బాధ్యత అనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కలిగించేలా అంగన్‌వాడీ కేంద్రాలు కృషి చేయాల‌ని తెలిపారు. ఇక అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకు త్వరలో యూనిఫాంలు అందజేయబోతున్నామని తెలిపారు

అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సరుకులు అందేలా జిల్లా సంక్షేమాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నాసిరకం సరుకులు అందితే అంగన్‌వాడీ టీచర్లు తిరస్కరించాలన్నారు. నాసిరకం సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దత్తత ప్రక్రియను కూడా సులభతరం చేసినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

ఈ సమీక్షలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement