డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడంతో ప్రిపేర్ అయ్యేందుకు సమయం లేదని.. ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత వాతవరణం నెలకొంది.
నిరుద్యోగ సంఘాల పిలుపు మేరకు సాయంత్రం నుంచే గ్రంథాలయానికి గ్రూప్స్, డీఎస్సీ పరీక్ష అభ్యర్థులు భారీగా చేరుకున్నారు.. అయితే అప్పటికే పోలీసులు బలగాలు భారీగా లైబ్రరీ వద్దకు చేరుకున్నాయి.
కాగా గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని, గ్రూప్-2, డీఎస్సీ డిసెంబర్‌లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. లైబ్రరీ నుంచి ర్యాలీగా బయటకు వెళ్లేందుకు అభ్యర్థులు యత్నించగా.. పోలీసులు లైబ్రరీ గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. లైబ్రరీలోనే ఆందోళన కొనసాగిస్తున్న అభ్యర్థులను అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
హరీష్ రావు ఆగ్రహం
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అని ప్రశ్నించారు. నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారని.. నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
.