ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట
వివిధ పథకాల ద్వారా చేయూత
సంచార చేపల విక్రయ వాహనాలకు శ్రీకారం
7 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి
అధికారికంగా సావిత్రి భాయి ఫూలే జయంతి వేడుకలు
ప్రజా భవన్ లో మంత్రి సీతక్క వెల్లడి
హైదరాబాద్ – మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతోనే ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు.. దీనిలో భాగంగా వివిధ పధకాలను మహిళల కోసం అమలు చేస్తున్నామన్నారు.. ప్రజాభవన్‌లో నేడు జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి సీతక్క జెండా ఊపి 25 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంచార చేపల విక్రయ వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం కావాలని అభిలషించారు మంత్రి… మండల కేంద్రం వరకు ఈ వ్యాపారం వెళ్ళాలని సూచించారు. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేయండని మహిళలను కోరారు. ఫిష్ ఫుడ్ కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలని అన్నారు.. 100 సక్సెస్ రేట్ ఉండాలని అన్నారు. అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్లు ఉండాలన్నారు.
భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి.. ఇద్దరూ చేయాల్సిందేనని అన్నారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.
అదికారికంగా సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు
దేశంలో మొదటి సారి సావిత్రి భాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు సీతక్క. ఆడవాళ్లకు చదువు అవసరం లేదనే మూఢనమ్మకాల నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్నామని అంటూ మహిళ ఇంటికే పరిమితం కాదని సావిత్రి భాయి ఫూలే నిరూపించారన్నారు. చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సావిత్రి భాయి ఫూలేనని కొనియాడారు. ఆదివాసీ బిడ్డ రాష్టప్రతిగా ఉన్నారని మంత్రి గుర్తు చేశారు.