Friday, November 22, 2024

TG గురుకుల భువన నిర్మాణాలకు రేవంత్ భూమి పూజ

పేదలకు కార్పొరేట్​ స్థాయి విద్య​ అందించడమే లక్ష్యం
ఇందిరమ్మ కలలుగన్న రాజ్య స్థాపనకు అడుగులు
150 కోట్లతో అధునాత స్కూల్​ బిల్డింగ్స్​ నిర్మాణం
శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్​ వెల్లడి
ఒకే రోజు 28 చోట్ల భూమి పూజ మహోత్సవం
సమీకృత గురుకులాల నిర్మాణ‌ల‌కు శంకుస్థాపన
షాద్‌నగర్ నియోజ‌క‌వ‌ర్గంలోని కొందుర్గులో సీఎం రేవంత్
లక్ష్మీపురంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క
పొన్నెక‌ల్లులో మంత్రి పొంగులేటి.. న‌ల్గొండలో మంత్రి కోమ‌టిరెడ్డి
హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ భూమి పూజ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ :
పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో సమీకృత గురుకులాల నిర్మాణానికి తెలంగాణ‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిదశలో 28 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను తీసుకురావాలని సీఎం రేవంత్ నిర్ణ‌యించారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలను కొనసాగిస్తూనే.. అత్యాధునిక వసతులతో సమీకృత భవనాలను నిర్మించే దిశగా ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కొడంగల్‌, మధిర, హుస్నాబాద్‌, నల్లగొండ, హుజూర్‌నగర్‌, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్‌, కొల్లాపూర్‌, అందోల్‌, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్‌, జడ్చర్ల, పరకాల, నారాయణఖేడ్‌, దేవరకద్ర, నాగర్‌కర్నూలు, మానకొండూరు, నర్సంపేటలో సమీకృత భవనాలను నిర్మించనుంది. ఇక ఈ 28 ప్రాంతాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్దితో స‌హా ప‌లువురు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు శుక్ర‌వారం భ‌వ‌న నిర్మాణాల‌కు భూమి పూజ చేశారు.

- Advertisement -

కొందుర్గులో సీఎం రేవంత్ రెడ్డి..

షాద్‌నగర్ నియోజ‌క‌వ‌ర్గంలోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10,006 పోస్టులు డీఎస్సీ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు ఉద్యోగ ఉన్నతి ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందని, గత ప్రభుత్వం అనేక స్కూల్స్ పెట్టిందే తప్ప పక్క వసతి కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు.

150 కోట్ల‌తో అధునాత‌మైన పాఠ‌శాల‌లు..

ఇందిరమ్మ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో 125 నుంచి 150 కోట్లతో అద్భుతమైన పాఠ‌శాల భ‌వ‌నాలను నిర్మాణం చేస్తామ‌ని తెలిపారు. గత ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందని సీఎం ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ₹300 కోట్లతో అనేక కంపెనీలతో స్కిల్ డవలప్ మెంట్ నైపుణ్యం పెంపొందించే అవకాశం కలిపించిందన్నారు. మాటలతో కాదు ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందని.. ప్రైవేటుకు దీటుగా పేద విద్యలకు కార్పొరేట్ విద్యానందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

నూతన భవనాల్లో సకల సౌకర్యాలు

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ మోడల్‌ను ఇప్పటికే ఖరారు చేశామ‌ని సీఎం రేవంత్​ అన్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, తరగతి గదులు, ప్రయోగశాలలు, ఆట స్థలం, బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు, టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ సిబ్బందికి నివాస సముదాయాలు ఏర్పాటు చేసేలా నమూనా రూపొందించామ‌న్నారు. తరగతి గదుల్లో డిజిటల్‌ బోర్డులు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, యాంప్‌ థియేటర్‌ వంటి అధునాత సౌకర్యాలు కల్పిస్తామ‌న్నారు. విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం క్రికెట్‌ గ్రౌండ్‌, ఫుట్‌బాల్‌ కోర్టు, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌ కోర్టులతోపాటు ఔట్‌డోర్‌ జిమ్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు.

లక్ష్మీపురంలో భ‌ట్టి విక్ర‌మార్క ..

మధిర నియోజకవర్గం బోనకల్ లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క శుక్రవారం శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. అంద‌రికీ ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండే విధంగా ఒకే చోట అన్ని రకాల విద్య‌ను అందించ‌డ‌మే ఈ గురుకులాల ల‌క్ష్యం అన్నారు. పేద‌ల‌కు ఈ స్కూల్స్ ఎంతో ప్ర‌యోజ‌న‌కరంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు.

పొన్నెక‌ల్లులో మంత్రి పొంగులేటి..

రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్​కి శంకుస్థాపన చేసుకుంటున్నామని, పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని, విద్య వైద్యానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్‌లో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అమ్మ ఆదర్శ పథకంతో ₹657 కోట్లతో ప్రభుత్వం వచ్చిన మూడునెల్లోనే చేపట్టి సౌకర్యాలు కల్పించిందని చెప్పారు.

న‌ల్గొండలో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి..
నల్లగొండలో ఇంటిగ్రేటెడ్ స్కూ్ల్ భవనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ప్రతి విద్యార్థికి విద్య అందిస్తామని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లు మూతపడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

హుస్నాబాద్​లో మంత్రి పొన్నం..

అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ హుస్నాబాద్ రావడంతో నియోజకవర్గం విద్యా రంగంలో మరింత ముందుకు పోతుందని, తన నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్‌గా మారాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో తంగలపల్లి గ్రామంలో రెసిడెన్షియల్ పాఠశాల కాంప్లెక్స్‌కు భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడిగా మీ అందరి ఆశీర్వాదంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యాన‌న్నారు.. నాలుగు గురుకులాలు ఒకే కాంప్లెక్స్‌గా విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు..నాలుగో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకునేలా భవనాల నిర్మాణం జరుగుతుంద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement