Tuesday, July 9, 2024

TG – ఉద్యోగాల భ‌ర్తీ చేస్తాం – నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలే తీసుకుంటాం – రేవంత్

ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగుల‌కు సూచించారు.

నిరుద్యోగుల ఆందోళ‌న‌ల దృష్ట్యా శుక్ర‌వారం సాయంత్రం ముఖ్య‌మంత్రి త‌న నివాసంలో స‌మావేశం ఏర్పాటు చేశారు. భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్‌, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర‌ అధ్య‌క్షుడు శివ‌సేనారెడ్డి, సామ రామ్మోహ‌న్‌రెడ్డి, ప‌వ‌న్ మ‌ల్లాది, ప్రొఫెస‌ర్ రియాజ్, టీచ‌ర్ల జేఏసీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, ఓయూ విద్యార్థి నాయ‌కులు చన‌గాని ద‌యాక‌ర్‌, మాన‌వ‌తారాయ్‌, బాల ల‌క్ష్మి, చార‌కొండ వెంక‌టేష్‌, కాల్వ సుజాత‌ త‌దిత‌రులు స‌మావేశంలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంట‌ల పాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో నిరుద్యోగుల‌కు సంబంధించిన డిమాండ్లు, జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌ను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. వెంట‌నే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో పాటు సంబంధిత అధికారుల‌ను పిలిపించి మాట్లాడారు.

నిరుద్యోగులు లేవ‌నెత్తిన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాల‌పై చ‌ర్చించారు. గ్రూప్ 1 ప‌రీక్ష‌కు ఒక్కో పోస్టుకు 1: 50 నిష్ప‌త్తి చొప్పున కాకుండా 1: 100 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాల‌నే డిమాండ్ పై ఈ సంద‌ర్భంగా సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిగింది. గ‌త ప్ర‌భుత్వం 2022లో వేసిన‌ గ్రూప్ 1 ప‌రీక్ష పేప‌ర్ల లీకేజీ, త‌ప్పుడు నిర్ణ‌యాల కార‌ణంగా రెండు సార్లు వాయిదా ప‌డింద‌ని, కొత్త ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో ఉన్న ఈ పిటిష‌న్ వెన‌క్కి తీసుకుంద‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు. పాత నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేసి అద‌నంగా మ‌రిన్ని పోస్టుల‌తో కొత్త నోటిఫికేష‌న్ జారీ చేసింద‌ని చెప్పారు.

- Advertisement -

ప‌న్నెండేండ్ల త‌ర్వాత చేప‌ట్టిన‌ గ్రూప్ 1 ప‌రీక్ష‌కు నాలుగు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డ్డారు.. ఇటీవ‌లే ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను టీజీపీఎస్‌సీ ప‌కడ్బందీగా నిర్వ‌హించింద‌ని చెప్పారు. నోటిఫికేష‌న్ ప్ర‌కారం ప్రిలిమ్స్ లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున‌ మెయిన్స్ కు ఎంపిక జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధ‌న‌ల‌ను స‌వ‌రిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్ర‌మాద‌ముంద‌ని, అదే జ‌రిగితే మొత్తం నోటిఫికేష‌న్ మ‌ళ్లీ నిలిచిపోతుంద‌ని అధికారులు వివ‌రించారు. నోటిఫికేష‌న్‌లో ఉన్న నిబంధ‌న‌ల‌ను మార్చితే న్యాయ‌ప‌రంగా చెల్లుబాటు కాద‌ని సీఎంకు వివ‌రించారు.

గ్రూప్ 1 ప‌రీక్ష రెండోసారి ర‌ద్ద‌యినప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్ప‌టి నోటిఫికేష‌న్‌లో ఉన్న‌ బ‌యో మెట్రిక్ ప‌ద్ధ‌తిని ఎందుకు పాటించ లేద‌నే ఏకైక‌ కార‌ణంతో రాష్ట్ర హైకోర్టు ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింద‌ని గుర్తు చేశారు. 1999లో యూపీఎస్‌సీ వ‌ర్సెస్ గౌర‌వ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహ‌రించారు. నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవ‌కాశ‌మిస్తే.. ముందుగా ఉన్న‌వాళ్ల‌కు అన్యాయం జ‌రిగిన‌ట్లే అని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింద‌న్నారు.గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు మీద కూడా చ‌ర్చ జ‌రిగింది. ప‌రీక్ష‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న స‌మ‌యంలో పోస్టులు పెంచ‌టం కూడా నోటిఫికేష‌న్ ను ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌ని, అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే ప‌రిస్థితి ఉంటుంద‌ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

గ్రూప్ 1 కు కొత్త నోటిఫికేష‌న్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచ‌టం సాధ్య‌మైంద‌ని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేష‌న్ల‌కు అలాంటి వెసులుబాటు లేద‌ని చెప్పారు.

ఈ సమీక్ష అనంతరం రేవంత్ మాట్లాడుతూ, ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మార్చితే త‌లెత్తే చ‌ట్ట ప‌ర‌మైన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ప్ర‌భుత్వం త‌గు నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన‌ట్లు త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటే నిరుద్యోగుల‌కు న్యాయం జ‌రగ‌క‌పోగా.. ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్ప‌టికే 28,942 ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టింద‌ని గుర్తు చేశారు. ఏళ్ల‌కు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామ‌కాల‌కు ఉన్న కోర్టు చిక్కుల‌న్నింటిని అధిగ‌మించింద‌ని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్ష‌లు నిర్వహించి, ఉద్యోగాలు భ‌ర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామ‌న్నారు.

శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే లో చ‌ర్చించి జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ నియామ‌క ప‌రీక్ష‌లు, వివిధ బోర్డులు నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌తో ఆటంకాలు ఏర్ప‌డ‌కుండా నిరుద్యోగుల‌కు పూర్తి న్యాయం జ‌రిగేలా క్యాలెండ‌ర్ రూపొందిస్తామ‌న్నారు. ఇంత కీల‌కంగా త‌మ ప్ర‌భుత్వం నిరుద్యోగుల విష‌యంలో క‌స‌ర‌త్తు చేస్తుంటే కొంద‌రు మాత్రం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం నిరుద్యోగుల జీవితాల‌తో చెల‌గాట‌మాడుతున్నార‌ని మండిపడ్డారు. కొంద‌రు చేసే కుట్ర‌ల‌తో నోటిఫికేష‌న్ల‌లోని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్ణ‌యాలు తీసుకుంటే ఉద్యోగాలు భ‌ర్తీ చేసే ప్ర‌క్రియ నిలిచిపోయి, నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం స్పష్టం చేశారు.

కాగా, గ్రూప్ 2, డీఎస్సీ ప‌రీక్ష‌లు ఒక‌దాని వెంటే ఒక‌టి ఉండ‌టంతో అభ్య‌ర్థులు న‌ష్ట‌పోతున్నార‌ని విద్యార్థి సంఘం నాయ‌కులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జులై 17నుంచి ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు డీఎస్సీ ప‌రీక్ష‌లు ఉన్నాయ‌ని, ఆ వెంట‌నే 7, 8 తేదీల్లో గ్రూప్ 2 ఉండటంతో ప్రిపరేష‌న్‌ను ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పారు. ప‌రీక్ష‌ల తేదీల విష‌యంలో టీజీపీఎస్‌సీ, విద్యాశాఖ‌తో చ‌ర్చించి త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం వారికి హామీ ఇచ్చారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement