Sunday, November 17, 2024

TG మీ ఫామ్ హౌస్‌కే పోదాం పా! హైడ్రా ఆగదు, బుల్డోజర్లు ఆగవు – రేవంత్

ఆర్థిక మూలల ధ్వంసానికి కుట్రలు
భ‌యం వ‌ద్దు.. రియల్ రంగానికి అండగా ఉంటాం
మూసీ బాధిత‌ పేదలకు ఇండ్లు ఇచ్చాం
వ్యాపారాలు చేసుకునే అవకాశం క‌ల్పించాం
ఆస్తులు కాపాడుకోవటానికే బీఆర్ఎస్‌ దొంగ ఏడ్పులు
మూసీ కూల్చివేత‌ల్లో హైడ్రా పాల్గొన‌లేదు
చెరువులు, ప్ర‌భుత్వ స్థలాల ప‌రిర‌క్ష‌ణ‌కే హైడ్రా ఏర్పాటు
హైడ్రా పేరుతో అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నారు
బిల్లా, రంగాలు అడ్డుప‌డితే హైడ్రా అస్స‌లు ఆగ‌దు
కేటీఆర్ ఫామ్‌హౌస్ విష‌యంలో అఖిలపక్షం వేస్తాం
నిజనిర్ధారణ కమిటీతో నిజాలేంటో నిగ్గు తేలుద్దాం
స‌వాళ్ల మీద స‌వాళ్లు విసిర‌న సీఎం రేవంత్‌
స‌ద్భావ‌న యాత్ర స్మార‌క దినోత్స‌వంలో విప‌క్షాల‌పై నిప్పులు

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ :
“ఆక్రమణలకు పాల్పడిన బడా బాబులకు హైడ్రా ఓ భూతం, ప్రభుత్వ భూములను, నాలాలు, చెరువులను ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు కట్టినోళ్లపై హైడ్రా ఓ అంకుశం, మదపుటేనుగులను అణచటానికి ఈ హైడ్రా అంకుశంలా పనిచేస్తుంది. కొందరు దీన్ని అడ్డుకోవాలని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌ను దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారు ” అని సీఎం రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. హైదరాబాద్ చార్మినార్ వ‌ద్ద శనివారం రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు.

ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌తీయాల‌ని కుట్ర..

రాష్ట్ర ఆర్ధిక మూలలను దెబ్బ తీయాలని కొంత‌మంది కుట్ర చేస్తున్నార‌ని, రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దు.. అండ‌గా ఉంటాన‌ని హామీ ఇస్తున్నా అని సీఎం స్పష్టం చేశారు. ‘‘మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. హైడ్రా ఆగదు, అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదు. హైడ్రా అనగానే హరీశ్‌, కేటీఆర్ బయటకు వస్తున్నారు. పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు”అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలో మగ్గిపోతున్న పేదలకు ఇండ్లు ఇచ్చి, వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ఆర్థిక సాయం అందించాం. మేం జనాన్ని గుండెల్లో పెట్టుకుంటుంటే బీఆర్ఎస్ నేతలు గుండెలు బాదుకుంటున్నారని విమర్శించారు.

బిల్లా రంగాలు వ‌చ్చినా బుల్డోజ‌ర్లు ఆగ‌వు..

- Advertisement -

ఈ బిల్లా రంగాలు వచ్చి బుల్డోజర్లకు అడ్డు పడతామంటున్నారు. అక్కడికి ఇక్కడికి కాదు.. జన్వాడ ఫామ్ హౌస్‌కు పోదాం పదా, గుల్ఖాపూర్ నాలాను ఆక్రమించి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టలేదా?, ఈ ఫామ్ హౌస్ కు బుల్డోజర్ వస్తుందనే ఇక్కడ వీళ్లు డ్రామాలు ఆడుతున్నారు,హరీశ్.. నీలాంటి చెప్పులు మోసే వారు కాదు.. ఫామ్ హౌస్‌లో పడుకున్న వాళ్లను రమ్మను నేను వస్తా. అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నా ఇంటి ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డ రోజులు మర్చిపోయావా?, ఫామ్ హౌసులు కాపాడుకునేందుకే ఈ బిల్లా రంగాల దొంగ ఏడ్పులు అని నిలదీశారు.

ఫామ్ హౌస్ త‌ర్వాతే ఎక్క‌డికైనా..

మూసీ పునరుజ్జీవనం వేరు… హైడ్రా వేరు. మూసీలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు. ట్రాఫిక్ సమస్య, నాలాల పునరుద్ధరణ, చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికే హైడ్రాను తీసుకువచ్చాం, బీఆర్ఎస్‌ వాళ్ల తాపత్రయం అంతా.. వాళ్ల ఆస్తులు కాపాడుకునేందుకే .. అక్కడికి ఇక్కడికి కాదు… ఎప్పుడైనా ఫామ్ హౌస్ కు రమ్మని సవాల్ చేశారా? అని రేవంత్‌ ప్రశ్నించారు. వాళ్ల ఫామ్ హౌస్‌ల వద్దకు ఎప్పుడు రావాలో హరీశ్‌ చెప్పాలి. హరీశ్, కేటీఆర్ ఫామ్ హౌస్ ల విషయంపై అఖిలపక్షం పిలుద్దాం.. నిజ నిర్ధారణ కమిటీతో నిజాలు నిగ్గు తేలుద్దాం.. ఆ తరువాత మూసీ దగ్గరకా.. ఇంకెక్కడికైనానా వెళదాం అని సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లపై సవాళ్లు విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement